చంద్రబాబు అన్నారా… అయితే డేంజరే..!

Chandrababu-Naidu-Fourth-Best-CM-in-India “పెద్ద నోట్లు రద్దు చేస్తున్నాము” అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడానికి దాదాపుగా ఓ ఏడాది, ఆరు నెలల ముందు నుండి చంద్రబాబు నాయుడు ఈ నోట్లు కేంద్రంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఇండియాలో అవినీతి పెరిగిపోవడానికి ఈ నోట్లే కారణమని, నిజానికి వీటి అవసరం సామాన్య ప్రజానీకానికి లేదని, దీని స్థానంలో డిజిటల్ కరెన్సీని ప్రభుత్వం ప్రోత్సహించాలని… ఇలా వీలైన ప్రతి సందర్భంలో పెద్ద నోట్లు అవసరం లేదు అన్న వ్యాఖ్యలను చేసారు.

అయితే ఈ వ్యాఖ్యలకు ప్రజలతో పాటు మీడియా వర్గాలు కూడా ప్రాధాన్యతనివ్వలేదు. కానీ ఒక్కసారి ఎప్పుడైతే నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేసారో… అప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మీడియా వర్గాలు పదే పదే ప్రసారం చేసాయి. నిజానికి అప్పట్లో చంద్రబాబు వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి కూడా! ఏది ఏమైనా… మోడీ చేసిన ఈ ప్రకటన వలన బడా బాబులు ఎలా ఇబ్బందులు పడ్డారో తెలియదు గానీ, సామాన్య ప్రజలు మాత్రం ప్రత్యక్ష నరకాన్ని చవిచూశారు.

ADVERTISEMENT

ముఖ్యంగా ఇళ్ళల్లో శుభకార్యాలు మరియు అత్యవసర పరిస్థితులలో డబ్బులు చేతులు మారక కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మరికొందరు చెప్పులు అరిగేలా బ్యాంకుల ముందు తిరుగుతూ సొమ్మసిల్లి పడిపోయారు. తీరా చూస్తే… స్వయంగా కేంద్రమే 99 శాతం కరెన్సీ తిరిగి వచ్చేసిందని స్పష్టత ఇచ్చింది. దీని వలన డిజిటల్ యుగం వైపుకు నేటితరం పరుగులు పెట్టారన్న విషయం గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఇదెలా ఉన్నా… తాజాగా మరోసారి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రజలను భయపెడుతున్నాయి.

అప్పుడు ఎలాగైతే పెద్ద నోట్లు అవసరం లేదని అన్నారో, తాజాగా కూడా అవే వ్యాఖ్యలు చేసారు. దేశంలో అవినీతిని సమూలంగా నిర్మించాలసిన అవసరం ఉందని, దానిని రూపుమాపాలంటే పెద్ద నోట్లను వ్యవస్థ నుండి పూర్తిగా తొలగించాలని కోరారు. అసలు 500 నోటు కూడా అవసరం కూడా లేని పరిస్థితులలో 2000 రూపాయి నోటు ఎందుకు అన్న చంద్రబాబు… 100, 200 నోట్లు సరిపోతాయని అన్నారు. అంటే మరోసారి పెద్ద నోట్లు రద్దు కానున్నాయా? అంటూ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

గతంలో చంద్రబాబు వ్యాఖ్యలను లైట్ గా తీసుకున్న ప్రజానీకం, ప్రస్తుతం మాత్రం ఆ పరిస్థితులలో లేరు. గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారంటే… అతి త్వరలో కాకపోయినా… త్వరలో ఈ 2000 నోటుకు కూడా శుభంకార్డు పడిపోయినట్లే అన్న సంకేతాలను ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. అయితే ఇటీవల ఆర్బీఐ అధికారులు ఈ 2000 నోటు రద్దు అంశంపై వివరణ ఇస్తూ… అలాంటి ఆలోచన తమకు లేదని, ఇప్పట్లో అది జరగదని స్పష్టంగా వెల్లడించారు.

ADVERTISEMENT
Latest Stories