ఏడు పదుల వయసు దాటినా, తనలో ఏ మాత్రం జోరు, హుషారు తగ్గలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగాలు చెప్తున్నాయి. రోజుకు మూడు సభలలో ప్రసంగిస్తోన్న చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ చర్యలను తూర్పారపడుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు.
“రాజధాని అంటే ఈ తిక్కలోడు మూడు ముక్కలాట” అనుకుంటున్నాడని జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎన్ని అబద్ధాలు చెప్పినా జనం నమ్మేస్తారని అనుకుంటున్నాడని, జగన్ వంటి రాక్షసులు 100 మంది కాదు, 1000 మంది వచ్చినా అమరావతిని కదపలేరని అన్నారు.
పొరుగున ఉన్న తెలంగాణకు, తమిళనాడుకు, కర్ణాటక రాష్ట్రాలకు రాజధాని ఏది అంటే, పేర్లు చెప్తారని, కానీ మనకు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని నిలిపిన ఘనత ఈ తిక్కలోడుకే దక్కుతుందని చంద్రబాబు చమత్కరించారు. మరో హైదరాబాద్ లా అమరావతిని తీర్చిదిద్దాలని భావిస్తే, ఓ దిక్కుమాలినోడు వచ్చి ఏం చేసాడో చూసారుగా అంటూ ఎద్దేవా చేసారు.
రాజధాని నిర్మాణం అంటే నాలుగు భవనాల కట్టడం కాదని, 30 వేల మంది రైతులు చేసిన 35 వేల ఎకరాల త్యాగాల పోరాటమని, జూన్ 4వ తేదీన జగనాసుర వధ, అమరావతి రక్షణ జరగబోతున్నాయని ప్రజలను ఉత్సాహపరుస్తూ, విజయమే లక్ష్యంగా చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ప్రసంగిస్తున్నారు.




