వైసీపీ ప్రభుత్వంలో సాగునీటిశాఖ మంత్రి అంబటి రాంబాబుకి ఇంతకాలం తన శాఖకు సంబందించి ఎవరూ నిలదీసి ప్రశ్నించకపోవడంతో పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొంటూ కాలక్షేపం చేసేశారు. అయితే ఇప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ ప్రకటించి నిలదీస్తుండటంతో సమాధానాలు చెప్పుకోలేక బ్రో సినిమా గురించి మాట్లాడటం మొదలుపెట్టారు.
బ్రో సినిమా ఆర్ధిక లావాదేవీల గురించి ఈడీకి ఫిర్యాదు చేసేందుకు నేడు ఢిల్లీకి బయలుదేరబోతున్నట్లు తెలుస్తోంది. అంటే చంద్రబాబు నాయుడు ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా పారిపోతున్నట్లే భావించాల్సి ఉంటుంది. సాగునీటి ప్రాజెక్టుల గురించి ఆ శాఖ మంత్రి సమాధానాలు చెప్పలేకపోతే, వైసీపీ ప్రభుత్వంలో మరెవరూ చెపుతారు?
వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పకపోయినా చంద్రబాబు నాయుడు మాత్రం ప్రాజెక్టుల వద్దకు వెళ్ళి స్వయంగా వాటి పరిస్థితిని పరిశీలించి, వాటిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తున్నారు. ఆనాడు తమ హయాంలో సదరు ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశాము?అప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏ దశలో ఉండేది?ఇప్పుడు ఏవిదంగా ఉంది?దానిపై జగన్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది?ఆ ప్రాజెక్టుతో ఏఏ ప్రాంతాలకు ఎంత నీరు అందుతుంది?వగైరా అన్ని వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు.
బుదవారం కడప జిల్లాలోని కొండాపురం మండలంలోని తిమ్మాపురం చేరుకొని అక్కడ సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, “నేను సాగునీటి ప్రాజెక్టుల గురించి అడుగుతుంటే ఆ శాఖ మంత్రి అంబటి రాంబాబు బ్రో సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఆయనకు ప్రాజెక్టుల గురించి అవగాహన లేదనే విషయం అర్దమైంది. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను విధ్వంసం చేసింది. రాయలసీమకు నీళ్లు అందించే ప్రాజెక్టులను సైతం పట్టించుకోలేదు. వాటి పరిస్థితి చూసి కనీళ్ళు వస్తున్నాయి.
కడప జిల్లాకు గుండెకాయ వంటిది గండికోట. ఇదొక పర్యాటక ఆకర్షణ కేంద్రం అని గుర్తించి మేము అప్పుడే దీనిని అభివృద్ధి చేశాము. గండిపేటకు నీళ్ళు తెచ్చేందుకే మేము అవుకు టన్నల్ ప్రారంభించాము. కానీ దానినీ జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. నేను ప్రాజెక్టుల వద్ద నిద్రపోయి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తే, జగన్ ప్రభుత్వం అవుకు తోటపల్లి వద్ద 5 ఏళ్ళవరకు టెండర్లే పిలవొద్దని నిలిపివేశారు. ఇదే మాకు ఈ జగన్ ప్రభుత్వానికి ఉన్న తేడా,” అని అన్నారు.
“మంత్రి పెద్దిరెడ్డి కోసమే ప్రాజెక్టులు… దానిలో మంత్రులే కాంట్రాక్టర్లు… కనుక అవసరంలేని పనులన్నీ చేస్తూ ప్రాజెక్టు పేరు చెప్పుకొని కోట్లు దండుకొంటున్నారు. ఈ ఒక్క జిల్లాలో ప్రాజెక్టుల ద్వారానే రూ.5,000 కోట్లు దోపిడీ చేస్తున్నారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత భద్రాచలం తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిపోవడంతో మేము కడప జిల్లాలో ఒంటిమిట్ట రామాలాయాన్ని రాష్ట్ర రామాలయంగా గుర్తించి అభివృద్ధి చేశాము. కానీ జగన్ ప్రభుత్వం దానినీ పట్టించుకోకుండా వదిలేసింది,” అని చంద్రబాబు నాయుడు నిశితంగా విమర్శించారు.
“ఇక్కడ కర్నూలు విమానాశ్రయాన్ని నేను ప్రారంభిస్తే, నాపేరున్న శిలాఫలకం తీయించేసి జగన్ తనది పెట్టించుకొని మళ్ళీ ప్రారంభోత్సవం చేశారు. ఇదెలా ఉందంటే ఎవరికో పుట్టిన బిడ్డకు నేనే తండ్రినని చెప్పుకొన్నట్లుగా ఉంది,” అంటూ చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వం తీరుని ఆక్షేపించారు.



