జగన్నాటకంలో అందరూ పావులు, సమిధలే: చంద్రబాబు

Chandrababu Naidu

వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ నిలిపివేయడం వెనుక మరో భారీ కుట్ర ఉందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. “తండ్రి, బాబాయ్ చావులనే తన రాజకీయాలకు వాడుకున్న జగన్మోహన్‌ రెడ్డి, వాలంటీర్లను, వృద్ధులైన పింఛనుదారులను వాడుకోకుండా ఉంటారా?” అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.

ADVERTISEMENT

శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజాగళం రోడ్ షోలో మాట్లాడుతూ, “పింఛన్ కోసం వెళ్ళి ఎండలకు తాళలేక 32 మంది వృద్ధులు చనిపోతే ఈ ముఖ్యమంత్రి వారిపట్ల ఎటువంటి సానుభూతి చూపకపోగా, 32 మంది చనిపోయారని నవ్వుతూ చెప్పారు. వారి మరణాలకు ఆయనే బాధ్యత వహించాలి.

ఇలాంటి శవరాజకీయాలు చేయడం జగన్‌కు కొత్త కాదు. గతంలో తన తండ్రి పోయినప్పుడు, తర్వాత ఎన్నికలలో బాబాయ్ వివేక హత్యకు గురైనప్పుడు ఇలాగే శవరాజకీయాలు చేశారు. మళ్ళీ ఇప్పుడూ అదే చేస్తున్నారు.

వృద్ధులనే కనికరం కూడా చూపకుండా జగన్‌ వారిని కూడా తన ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం తిప్పించుకుంటూ పింఛన్లు చెల్లించకుండా వారిపట్ల చాలా క్రూరంగా వ్యవహరిస్తున్నారు. వారికి చెల్లించాల్సిన పింఛను సొమ్ములో కొంత ఇప్పటికే దారి మళ్ళించాడు. అందుకే పింఛన్లు చెల్లించడం లేదు.

నేను ఎన్నికల ప్రధానాధికారికి ఫోన్ చేసిన తర్వాతే పింఛన్లు ఇవ్వడం ప్రారంభించారు. సచివాలయాలలో, మునిసిపల్, రెవెన్యూ శాఖలలో లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం తలుచుకుంటే వారందరి సాయంతో ఒక్క రోజులోనే రాష్ట్రంలో అందరికీ పింఛన్లు అందించవచ్చు.

కానీ జగన్‌ ఈ సమస్య నుంచి ఎన్నికలలో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే పింఛన్లు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారు. దీని వలన వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనుక ఇకనైనా ఈ శవరాజకీయాలు కట్టిపెట్టి అందరికీ తక్షణం పింఛన్లు అందించాలని కోరుతున్నాను,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.

“మరోపక్క ఇన్నేళ్ళు వాలంటీర్లతో వెట్టి చాకిరీ చేయించుకొని ఇప్పుడు వారిని రాజీనామాలు చేయమని జగన్‌ తన నేతలతో ఒత్తిడి చేయిస్తున్నాడు. అందుకు అంగీకరించనివారిపై అక్రమకేసులు పెట్టిస్తున్నారు. తన కోసం ఇన్నేళ్ళు కష్టపడిన వాలంటీర్లను కూడా వేధించడానికి జగన్‌ వెనకాడటం లేదు. అందుకే వాలంటీర్లు కూడా ఇప్పటికైనా జగన్‌ నైజాన్ని గుర్తించాలి,” అని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.

ADVERTISEMENT
Latest Stories