అయితే ఏపీలో మొనగాడు చంద్రబాబు నాయుడేగా!

ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి తరచూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని ‘ముసలోడు’ అంటూ అవహేళన చేస్తుంటారు. కానీ ఆయన రాయలసీమలో రాళ్ళు పగిలే మండుటెండల్లో రోజుకి కనీసం మూడు సభల్లో పాల్గొంటున్నారు. కానీ జగన్‌ ఏసీ బస్సులో తిరుగుతూ‘మేమందరం సిద్దం’ అంటున్నారు.

ADVERTISEMENT

జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ కూడా ఈ విషయంలో చంద్రబాబు నాయుడుతో పోటీ పడలేకపోతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ బుధవారం ఒక్కరోజే సుమారు 20 కిమీ పాదయాత్ర చేయడంతో వడదెబ్బ తగిలి నీరసించిపోయారు. తీవ్ర జ్వరం కూడా రావడంతో ఈరోజు సాయంత్రం తెనాలిలో జనసేన ర్యాలీ, తర్వాత బహిరంగ సభలో పాల్గొనవలసిన కార్యక్రమాలు రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్‌ వెళ్ళిపోయారు. మళ్ళీ తేరుకున్నాక తెనాలిలో ఎన్నికల ప్రచారానికి వస్తారని జనసేన తెలియజేసింది.

ఏపీలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్‌ రెడ్డి, పవన్‌ కళ్యాణ్‌ ముగ్గురూ మూడు పార్టీల అధినేతలు. వారి ముగ్గురిలోకి చంద్రబాబు నాయుడు వయసులో, అనుభవంలో చాలా పెద్ద. కనుక ఇవే ఆయనకు చివరి ఎన్నికలని వైసీపిలో నోటి దురద మంత్రులు, నేతలు ఎద్దేవా చేస్తుంటారు. కానీ వైసీపిలో పలువురు ముఖ్య నేతలే ‘ఇవే మాకు చివరి ఎన్నికలని కనుక మమ్మల్ని గెలిపించాలని ప్రజలను వేడుకొంటుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఏనాడూ ఇవే నా చివరి ఎన్నికలని చెప్పుకొని ఎవరినీ ఓట్ల కోసం బ్రతిమలాడుకోవడం లేదు. మీకు మేలు చేశాను కనుక నాకే ఓట్లు వేయాలని ప్రాధేయపడటం లేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని గాడిన పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో ముందుకు నడిపిస్తానని చెప్పి ఓట్లు అడుగుతున్నారు.

తెలంగాణ రాజకీయాలను శాశించి దేశ రాజకీయాలలో కూడా చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్‌, ఒకే ఒక్క ఎన్నికలలో ఓడిపోయేసరికి ఎలా చతికిల పడిపోయారో, బిఆర్ఎస్ పార్టీ ఏవిదంగా చెల్లాచెదురు అయిపోతోందో అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ టిడిపికి ఎన్ని ఓటములు ఎదురైనా పార్టీ చెక్కుచెదరలేదు. పైగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పరోక్షంగా తోడ్పడింది కూడా.

గతంలో కేసీఆర్‌, గత 5 ఏళ్లుగా జగన్‌ ఇద్దరూ చంద్రబాబు నాయుడు రాజకీయజీవితానికి, టిడిపికి సమాధి కట్టేయాలని ఎంతగానో ప్రయత్నించారు. కేసీఆర్‌ చేయలేని పని అంటే చంద్రబాబు నాయుడుని జైలుకి పంపించడం నేను చేశానని జగన్‌ సంతోషపడితే, ఇక టిడిపి పని అయిపోయిందంటూ వైసీపి నేతలు స్వీట్లు పంచుకొని, టపాకాయలు కాల్చి పండుగ చేసుకున్నారు కూడా.

కానీ చంద్రబాబు నాయుడు ఆ బంధనాలన్నిటినీ తెంచుకొని మళ్ళీ జగన్మోహన్‌ రెడ్డి ఎదుట నిలిచి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ప్రతీ ఓటమిని మరో విజయానికి మెట్టుగా మార్చుకొని చంద్రబాబు నాయుడు అభివృద్ధి మంత్రం జపిస్తూ పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకే సాగుతున్నారు.

అప్పులు చేసి డబ్బు పంచడం కాదు… సంపద సృష్టించి పంచిపెట్టాలి. ఒంట్లో శక్తి ఉన్న ప్రజలందరూ తమ కాళ్లపై తాము నిలబడి మరో నలుగురికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని చంద్రబాబు నాయుడు వాదిస్తుంటారు. ఇటువంటి నాయకుడే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చాలా అవసరం కదా?

ADVERTISEMENT
Latest Stories