రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఎవరు ఉండరనేది జగమెరిగిన సత్యమే. అయితే ఏ రాజకీయ పార్టీయినా, ఏ రాజకీయ నాయకుడైన తన పార్టీ ఉనికి కోసమో, తన అధికారం కోసమో రాజీ పడతాడు, రాజకీయం చేస్తాడు. అయితే దాదాపుగా ఈ రాజకీయ రాజీలు అవసరం తో మొదలై అత్యాశతో ముగుస్తాయి.
ఇటువంటి అవకాశావాదంలో కూడా ఒక్కోసారి ఆదర్శంగా నిలిచే రాజకీయాలు అరుదుగా కనిపిస్తుంటాయి. వాటిలో టీడీపీ, జనసేన పార్టీల పొత్తు ప్రక్రియ ఒకటి. వైసీపీ వ్యతిరేక ఓటు చిలనివ్వను అంటూ ఇచ్చిన మాట కోసం పవన్ నిలబడితే, రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలకడానికి బాబు తోడయ్యారు.
పోటీచేసిన రెండు చోట్ల ఓడిపోయావు, కనీసం పార్టీ నుంచి పట్టుమని పదిమంది ఎమ్మెల్యే లను గెలిపించుకోలేక పోయావు, పార్టీ పెట్టి పదేళ్లు గడిచినా ఇంకా తడబాటేనా అంటూ హేళన చేసిన వైసీపీ నోటికి తాళం వెయ్యాలి అంటే పవన్ కు టీడీపీ బలం అవసరం. అలాగే పార్టీ అధినేతనే జైలుకు పంపి పార్టీని విచ్ఛిన్నం చెయ్యాలి అని చూసిన వైసీపీని చావు దెబ్బ కొట్టాలి అంటే టీడీపీ కి పవన్ తోడు అవసరం.
ఇలా నాడు ‘అవసరం’తో మొదలైన పొత్తు నేడు ‘ఆదర్శముగా’ మారింది. ఒక పార్టీ బలాన్ని మరో పార్టీకి అందిస్తూ ఒకరి బలహీనతను మరొకరు బలంగా మార్చుకుంటూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. లక్ష్యం పూర్తయ్యిందని పెట్టుకున్న పరిమితులను అతిక్రమించలేదు, అధికారం అనే అందలం దొరికింది కదా అని తెప్ప తగలెయ్యలేదు, ఇప్పటికి ఒకరి మీద మరొకరికి అదే గౌరవం, ఒక పార్టీ మీద మరో పార్టీకి అదే నమ్మకం.
ఒకరి వెనుక ఒకరు కాకుండా కృష్ణార్జునుల మాదిరి, రామ లక్ష్మణుల లెక్క ఒకరికి తోడుగా ఒకరు కలిసి నడుస్తున్నారు. తనకు లేని రాజకీయ అనుభవాన్ని చంద్రబాబు దగ్గర నేర్చుకోవడానికి తానేమి వెనుకాడనని, బాబుని ఒక రాజకీయ గురువుగా భావించడానికి చిన్నతనం గా చూడనని పవన్ బహిరంగంగానే వెల్లడించి బాబు మీద తనకున్న గౌరవాన్ని బయటపెట్టారు.
అలాగే రాష్ట్రం కోసం, మూడు పార్టీల పొత్తు కోసం పవన్ ఏంతో తగ్గారని, నలిగిపోయాడని ఈ విజయంలో పవన్ పాత్ర అభినందనీయమని బాబు పవన్ మీద తనకున్న ప్రేమను సమయం వచ్చినప్పుడల్లా వ్యక్తపరుస్తూనే వస్తున్నారు. నేర్చుకోవాలి అనే తపన, ప్రజలకు మంచి చెయ్యాలి అనే ఆలోచన పవన్ లో మెండుగా ఉన్నాయని, నిస్వార్థ రాజకీయ నాయకుడు పవన్ అంటూ పవన్ ను సందర్భం చేసుకుని మరి అభినందిస్తున్నారు బాబు.
రాజకీయాలలో ఒకరు చేసిన మంచిని బయటకు చెప్పడం కూడా తప్పుగా భావించే ఈ తరం రాజకీయాలలో బాబు, పవన్ ల మధ్య కొనసాగుతున్న ఈ మైత్రి నిజంగా ఆదర్శనీయం. ఈ రోజులలో సొంత కుటుంబ సభ్యుల నుండే రాజకీయ పోటీ ఎదురయితే తట్టుకోలేక వారి పై వ్యక్తిగత దాడికి సైతం వెనుకాడని రాజకీయాలు జరుగుతున్న నేపథ్యంలో బాబు, పవన్ ల రాజకీయ బంధం భావితరం రాజకీయ నాయకులకు ఆదర్శనీయం..ఆచరణాత్మకం.
తన కుమారుడు ప్రభుత్వంలో మంత్రి స్థానంలో ఉన్నా, తన రాజకీయ వారసుడిగా లోకేష్ ను పార్టీ శ్రేణులు భావిస్తున్న బాబు ప్రభుత్వంలో తన తరువాత స్థానం ఒక రకంగా చెప్పాలంటే తనతో సమానమైన స్థానాన్ని జనసేనాని పవన్ కోసం కూటమి ప్రభుత్వంలో సిద్ధం చేసారు. దీనితో అటు జనసేన పార్టీలోనూ బాబు పట్ల గౌరవంతో పాటు టీడీపీ విలువ పెరిగింది.
అలాగే తన కోసం ప్రణాలిచ్చే జనసైనికులను సైతం టీడీపీ పార్టీకోసం, బాబు నాయకత్వం కోసం కాస్త తగ్గాలి అని ఒప్పించి నెగ్గాడు పవన్. ప్రజలలో తనకున్న స్టార్ డం కన్నా బాబు రాజకీయ అనుభవమే రాష్ట్రానికి శ్రీరామా రక్ష అంటూ బాబుతో కలిసి అడుగేస్తూ నాయకుడిగా నిలబడ్డారు. అవసరం కోసం ఏర్పడిన వీరిద్దరి బంధం నమ్మకం తో మొదలై, గౌరవంగా కొనసాగుతూ, విలువలతో కూడిన రాజకీయం చేస్తూ రాజకీయాలకు ఆదర్శంగా నిలిచింది.




