సాధారణంగా ప్రభుత్వాలు జారీ చేసే జీవోలకి తిరుగు ఉండదు. నూటికి నూరుశాతం అమలుకావలసిందే. కానీ కొన్ని సందర్భాలలో వాటిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలలో పిటిషన్లు దాఖలైనప్పుడు, సదరు జీవోలపై విచారణ జరిపి అవి రాజ్యాంగ విరుద్దమని లేదా ప్రజావ్యతిరేకమైనవని భావిస్తే స్టే విధిస్తుంటాయి లేదా రద్దు చేస్తుంటాయి. చివరికి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలైనా న్యాయస్థానాలలో నిలబడగలగాలి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన అనేక జీవోలని హైకోర్టులు, సుప్రీంకోర్టు కొట్టివేయడమో లేదా స్టే విధించినవి కోకొల్లలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన వ్యవసాయ చట్టాలనే రైతుల నిరసనలు తట్టుకోలేక ఉపసంహరించుకోవలసి వచ్చిందని మరిచిపోకూడదు.
ప్రభుత్వం జారీ చేసిన జీవోలని ప్రజలు, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తే చెల్లుబాటవుతాయా?అవకపోతే ఎవరికి అవమానం? ప్రభుత్వానికే కదా?వాటిని ఉల్లంఘించినవారిపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ ప్రజలు దానిని ధిక్కరిస్తుంటే ఎంతమందిపై కేసులు నమోదు చేయగలదు?ఎంతమందిని జైల్లో పెట్టగలదు?అని ఆలోచించినప్పుడు ఇటీవల ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో కళ్ళ ముందు మెదలకమానదు.
తొక్కిసలాటలలో ప్రజలు చనిపోతున్నారు కనుక రాష్ట్ర ప్రభుత్వం రోడ్లపై సభలు, రోడ్ షోలు నిర్వహించకూడడంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రజల ప్రాణాలు కాపాడాలనేది పైకి కనబడుతున్న ఉద్దేశ్యంకాగా దాంతో రాష్ట్రంలో ప్రతిపక్షాలను సభలు, ర్యాలీలు నిర్వహించకుండా అడ్డుకోవాలనేది అసలు ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
ఈ చీకటి జీవోతో రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతు నొక్కి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టిడిపి, జనసేన, బిజెపి, వామపక్షాలు వాదిస్తున్నాయి. సరే! ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతో దానిని జారీ చేసినా ప్రజలు దానిని గౌరవించడం లేదనే విషయం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో స్పష్టమైపోయింది. చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనని అడ్డుకొనేందుకు వందలాది మంది పోలీసులను మోహరించి, టిడిపి నేతలనీ, కార్యకర్తలని ఎక్కడికక్కడ అడ్డుకొన్నప్పటికీ వేలాదిమంది చంద్రబాబు నాయుడు పర్యటనలో పాల్గొన్నారు.
ప్రతిపక్షాల గొంతులు అణచివేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోని పట్టించుకోనని, ప్రభుత్వం తనని ఎంతగా వేదించినా, వెంటాడినా ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉంటానని, చంద్రబాబు నాయుడు కూడా నిర్ద్వందంగా చెప్పడమే కాకుండా కుప్పంలో షెడ్యూల్ ప్రకారం తన పర్యటనని కొనసాగించారు.
అంటే ప్రభుత్వం జారీ చేసిన జీవోని ప్రజలూ పట్టించుకోలేదు… ప్రతిపక్షాలు పట్టించుకోవడంలేదని తేలిపోయింది. ప్రభుత్వం జీవో జారీ చేసినా ప్రజలు, ప్రతిపక్ష నాయకుడు దానిని పట్టించుకోలేదంటే అది ప్రభుత్వానికే అవమానం కాదా?దానిని ఉల్లంఘించినందున పోలీసులు కేసులు నమోదు చేయవచ్చు. కానీ కందుకూరు టిడిపి నేతలు ఇంటూరి నాగేశ్వర రావు, ఆయన సోదరుడు, ఇంటూరు రాజేష్‌లను అరెస్ట్ చేస్తే చివరికి ఏం జరిగింది?న్యాయమూర్తి బెయిల్ ఇచ్చి పంపించేశారు కదా?రేపు కుప్పంలోనూ అదే జరుగవచ్చు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పర్యటించబోయే అన్ని ప్రాంతాలలోనూ ఇలాగే జరుగవచ్చు.
ఈవిదంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో పదేపదే ఉల్లంఘనకు గురవుతోందంటే ప్రజాభీష్టానికి అది విరుద్దంగా ఉందనే కదా దానర్దం!ప్రజల కోసమే ప్రభుత్వాలు పనిచేయాలి కానీ ప్రభుత్వం కోసం జీవోలు కావు కదా?ఒకవేళ ఆ జీవో పేరు చెప్పి అరెస్ట్ చేసుకుపోతుంటే రేపు న్యాయస్థానానికి వారు, ప్రభుత్వమూ ఏం సమాధానం చెప్పగలవు?
ఒకవేళ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఈ జీవోని తిరస్కరిస్తే అప్పుడు పోయేది ప్రభుత్వం పరువే కదా?కనుక ప్రజలు వ్యతిరేకిస్తున్న జీవోని ప్రభుత్వం ఉపసంహరించుకోవడమో, అలా చేస్తే పరువు పోతుందనుకొంటే నిశబ్ధంగా అటకెక్కించేయడమో మంచిది. లేకుంటే ఈ జీవోతో ప్రభుత్వం ఏదో సాధిద్దామనుకొంటే మరేదో జరిగే అవకాశం కనిపిస్తోంది.



