ఇంతకాలం విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతుండేవి. కానీ తొలిసారిగా రాజధాని అమరావతిలోని రాయపూడి పరేడ్ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి.
మరో విశేషమేమిటంటే, మొన్న ప్రారంభోత్సవమైన సీడ్ యాక్సిస్ రోడ్ మీదుగా సిఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ బుల్లెట్ ఎస్కార్టుతో రాయపూడి పరేడ్ గ్రౌండ్స్ చేరుకుంది.
డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఉన్నతాధికారులు సిఎం చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. అనంతరం రాయపూడి పరేడ్ గ్రౌండ్స్‌లో సిఎం చంద్రబాబు నాయుడు జాతీయ జెండా ఎగురవేశారు. తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెన్నంటి రాగా అందంగా పూలతో అలంకరించిన జీపులో నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
ఐదేళ్ళ జగన్ పాలనలో అమరావతి ఓ పాడుబడిన నగరంగా మార్చగా, సిఎం చంద్రబాబు నాయుడు కేవలం రెండేళ్ళలో ఆంధ్రులు గర్వపడే రాజధానిగా మళ్ళీ మార్చారు.
నాడు కమ్మరావతి, భ్రమరావతి, శ్మశానం, వేశ్యలు ఉండే ప్రాంతం, చినుకు పడితే మునిగిపోతుందంటూ వైసీపీ నాయకులు అమరావతి గురించి చాలా అవహేళనగా మాట్లాడారు. నేటికీ అలాగే మాట్లాడుతున్నారు. కానీ వారి కళ్ళెదుటే చకచకా అమరావతి అద్భుతంగా నిర్మితమవుతోంది.
సీడ్ యాక్సిస్ రోడ్ అందుబాటులోకి రావడంతో దానిపై రాకపోకలు సాగిస్తున్న సామాన్య ప్రజలు, ఈ మార్పుని చాలా ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా వివిధ జిల్లాల నుంచి ఇదివరకు అమరావతి ప్రాంతాలకు వచ్చి వెళ్ళినవారు, ఇప్పుడు అమరావతిని దానిలో ఎక్కడ చూసినా జరుగుతున్న నిర్మాణ పనులను, అద్భుతంగా తీర్చిదిద్దిన సీడ్ యాక్సిస్ రోడ్‌ని చూసి చాలా సంతోషిస్తున్నారు. కేవలం రెండేళ్ళలోనే ఇంత మార్పా? అని ఆశ్చర్యపోతున్నారు.
ఈ దశలోనే అమరావతిని చూసి ఆశ్చర్యపోతున్నవారు మరో రెండుమూడేళ్ళలో బహుళ అంతస్తుల భవనాలతో, పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారబోయే రాజధాని అమరావతిని చూసి మరెంత సంతోషిస్తారో?
పాలకులకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన, చిత్తశుద్ధి, దూరదృష్టి ఉంటే ఏదైనా సాధ్యమేనని ఈ వయసులో కూడా సిఎం చంద్రబాబు నాయుడు నిరూపిస్తుంటే, రప్పారప్పాలకు అర్ధమవడం లేదు. అర్దమై ఉండి ఉంటే, రప్పారప్పా అంటూ హడావుడి చేసే బదులు ‘మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఫలానా అభివృద్ధి పని చేసి చూపిస్తామని’ గట్టిగా చెప్పుకునేవారు కదా?
ఏది ఏమైనప్పటికీ, మొదట గ్రాఫిక్స్‌లా కనబడినవారి కళ్ళెదుటే, ప్రజల ఆకాంక్షలకు నిలువెత్తు నిదర్శనంగా అమరావతి సాక్షాత్కరిస్తోంది.
ఇందుకు సంతోషించేవాళ్ళు సంతోషిస్తూనే ఉన్నారు. కడుపు మంటతో రగిలిపోతున్నవారు బాధతో రగిలిపోతూనే ఉన్నారు. ఎవరు ఏది కోరుకుంటే అదే ఇస్తోంది అమరావతి.




