అమరావతిపై బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. ఆ అంశంతో తమకు సంబంధం లేదు అనే కాకుండా… మూడు రాజధానుల ఏర్పాటు తప్పేమీ కాదని తేల్చి చెప్పింది. వరుసగా మూడో అఫిడవిట్ లో కూడా ఈ అంశంతో మాకు సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు స్పష్టం చేసింది.
అలాగే విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులు తప్పులేదని కేంద్రం తేల్చిచెప్పింది. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే చెప్పామని, రాజధానులపై కేంద్రం పాత్రపై పిటిషనర్ వి అపోహలేనని హోంశాఖ వెల్లడించింది.
సెక్షన్ 13 ప్రకారం రాజధాని అంటే ఒకటికే పరిమితం కావాలని కాదని పేర్కొంది. 2018లో అప్పటి ప్రభుత్వం అమరావతిలో హైకోర్టు పెట్టిందని,హైకోర్టు ఉన్నంత మాత్రాన అమరావతినే రాజధాని అని చెప్పలేమని స్పష్టం చేసింది. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం అని కేంద్రం తెలిపింది.
దీనితో రాజధాని తరలింపు విషయంలో కేంద్రం ఏదో చేస్తుంది అన్న అమరావతి రైతుల ఆశలు ఆవిరైపోయినట్టే. ఈ విషయంలో కేంద్రం రాష్ట్రప్రభుత్వాన్ని ఆపకపోగా… మూడు రాజధానులకు కోర్టులలో మద్దతు ఇవ్వడం గమనార్హం. దీనితో ఇప్పుడు అమరావతి రైతులకు ప్రభుత్వం తమతో చేసుకున్న ఒప్పంద ఉల్లంఘన అనే పాయింట్ మాత్రమే మిగిలింది.



