విజయనగరం జిల్లా వేదికగా మొదలుపెట్టిన ‘యువగళం – నవశకం’లో గళం వినిపించిన ప్రముఖ నాయకులందరూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీరును తూర్పారబట్టారు. లోకేష్ ప్రారంభించిన విమర్శల వాడివేడిని జనసేన అధినేత ప్రజలకు అర్ధమయ్యేలా వివరించగా, చివరగా మైక్ అందుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరిన్ని అంశాలను స్పృశించారు.
భారతదేశ చరిత్రలో ఎంతో మంది నాయకులు ఎన్నో యాత్రలు చేసారని, నాడు ఎన్టీఆర్ మొదలుపెట్టిన ‘చైతన్య యాత్ర’ నుండి ఏపీలో కూడా చాలా మంది నాయకులు పాదయాత్ర చేసారని, గతంలో నేను కూడా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకున్నానని, కానీ ‘పాదయాత్ర’ మీద ‘దండయాత్ర’ చేసిన నాయకుడు ఎవరూ లేరని జగన్ తీరును ఏకరువు పెట్టారు.
ఇదే విషయాన్ని లోకేష్, పవన్ కళ్యాణ్ లు కూడా తన ప్రసంగంలో ప్రస్తావించడం విశేషం. తన పాదయాత్రను అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసారో, ఎంత విధ్వంసం చేసారో మీరంతా చూసారని లోకేష్ తెలుపగా, తన వారాహి యాత్రను కూడా నియంత్రించడానికి చేసిన ప్రయత్నాలను జనసేన అధినేత కూడా గుర్తు చేసారు.
రాష్ట్ర సంక్షేమం కోసం బేషరతుగా ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక అభినందనలు తెలిపిన చంద్రబాబు నాయుడు, ‘నౌ ఆర్ నెవెర్’ అంటూ ఇచ్చిన స్లోగన్ ను పలికారు. ఇప్పుడు గనుక జగన్ ను రాష్ట్రం నుండి తరిమి కొట్టకపోతే రాష్ట్రం మరింత దుర్భర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందని ప్రజలను హెచ్చరించారు చంద్రబాబు.
హుద్ హుద్ సమయంలో విశాఖను తానూ ఏ విధంగా దగ్గరుండి చూసుకున్నారో తెలిపిన చంద్రబాబు, భోగాపురం ఎయిర్ పోర్ట్ కు తాను చేసిన శంకుస్థాపనకు ఇటీవల మళ్ళీ జగన్ శంకుస్థాపన చేయడం అతని అవివేకానికి నిదర్శనంగా బాబు పేర్కొన్నారు. పోలీసుల అండతో తప్పుడు కేసులు పెట్టిస్తున్న వైనాన్ని కొంతమంది పోలీసులు ఇటీవల తన దగ్గర ప్రస్తావించారని అన్నారు.
ప్రస్తుతం జగన్ చేసిన ప్రతి దానికి ప్రతిచర్య చేసి వడ్డీతో సహా ఇస్తామని అన్న చంద్రబాబు, ఈ సభకు ప్రజలు రావడానికి కేంద్రం మూడు ప్రత్యేక రైళ్లను ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఆర్టీసీ బస్సు కూడా ఇవ్వకుండా జగన్ నియత్రించాడని, ఇక జగన్ సినిమా అయిపోయిందని, రాబోయేది టీడీపీ – జనసేన ప్రభుత్వమేనని, ఆ విధంగా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు టీడీపీ అధినేత.




