ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు నదీ జలాలను అవసరమైన ప్రాంతాలకు పారించుకుంటూ చాలా సమర్ధంగా వాటర్ మేనేజ్మెంట్ చేస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పారు.
అయితే తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే ప్రయత్నంలో నీళ్ళ వాడకం విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ నిజమేనని అప్రయత్నంగా ఒప్పేసుకుంటున్నారు కూడా.
ఇదివరకు సిఎం చంద్రబాబు నాయుడు నీళ్ళ వాటాలు, వాడకం గురించి మాట్లాడుతూ, “ఏటా లక్షల క్యూసెక్కుల నీళ్ళు సముద్రంలో వృధాగా కలిసిపోతున్నాయి. కనుక తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై ఇంకా ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణ, గోదావరి నీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలిగితే చాలు,” అని అన్నారు.
నాడు సిఎం చంద్రబాబు నాయుడు ఈవిధంగా చెప్పినప్పుడు ఆయనను మెచ్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ నేతలకు మనసొప్పలేదు. కానీ కొన్ని రోజుల క్రితమే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ “చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు, ఆయనకు గురుదక్షిణగా సిఎం రేవంత్ రెడ్డి గోదావరి నీళ్ళు దిగువకు వదిలేస్తున్నారంటూ” చాలా చులకనగా మాట్లాడారు. కానీ ఇప్పుడు అదే నోటితో ఇద్దరూ సిఎం చంద్రబాబు నాయుడును అభినందిస్తున్నారు.
అంతేకాదు… లక్షల క్యూసెక్కుల అమూల్యమైన గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయనే సిఎం చంద్రబాబు నాయుడు మాటలను కూడా వారు అంగీకరిస్తున్నారు.
కళ్ళెదుటే లక్షల క్యూసెక్కుల నీళ్ళు పారుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోటార్లు ఆన్ చేసి ఎత్తిపోయకుండా దిగువకు వదిలేస్తున్నారని, అలా సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నీటిని సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో అవసరమైన ప్రాంతాలకు పారించుకుంటున్నారని ఇద్దరూ మెచ్చుకుంటున్నారు.
అంటే ఇంతకాలం సిఎం చంద్రబాబు నాయుడు చెప్పింది వాస్తవమే అని కేటీఆర్, హరీష్ రావులకు తెలిసి ఉన్నప్పటికీ ఒప్పుకునేందుకు ఇగో లేదా రాజకీయ శత్రుత్వం అడ్డొచ్చింది.
కానీ ఇప్పుడు తమ సిఎం రేవంత్ రెడ్డి అసమర్ధత, వైఫల్యం ఎత్తి చూపుతూ ఆయనను తక్కువ చేసి చూపేందుకు తమ బద్ధ శత్రువైన సిఎం చంద్రబాబు నాయుడుని పొగిడేందుకు వెనకాడటం లేదు.
ఈ ప్రయత్నంలో కృష్ణ, గోదావరి నీరు వృధాగా సముద్రంలో కలిసిపోకుండా సద్వినియోగం చేసుకోవాలనే సిఎం చంద్రబాబు నాయుడు వాదనతో కూడా వారు ఏకీభవించక తప్పలేదు.
అవహేళన చేసిన నోటితో తమ రాజకీయ శత్రువును పొగడాల్సి రావడం ఖచ్చితంగా దేవుడి స్క్రిప్టే! బహుశః వైసీపీతో దోస్తీ వలన బీఆర్ఎస్ పార్టీకి కూడా దేవుడి స్క్రిప్ట్ వర్తిస్తోందేమో?





