అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకులు చాలా శక్తివంతంగా మారితే, వారిని ప్రతిపక్షాలు, వారందరినీ సోషల్ మీడియా మేనేజ్ చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
ఒకప్పుడు పరిశుభ్రంగా ఉండే సోషల్ మీడియాలోకి రాజకీయ పార్టీలు ప్రవేశించడంతో అది కలుషితం అయిపోయింది. వాటికి తోడుగా అభిమానులు, శ్రేయోభిలాషులు, సోషల్ మీడియా విభాగాలు, దానిలో ‘వారియర్స్’ పేరుతో కాలకేయ సైన్యాలు వచ్చేశాయి.
కనుక వాటి మద్య సోషల్ మీడియాలో నిత్యం భీకర యుద్ధాలు జరుగుతునే ఉంటాయి. ఇప్పుడు ‘ఏఐ’ అనే అత్యంత శక్తివంతమైన మరో ఆయుధం ఆ కాలకేయ సైన్యాల చేతికి వచ్చాక, వాటి యుద్ధ తీవ్రత, సోషల్ మీడియాలో కాలుష్యం ఇంకా పెరిగిపోయింది.
సోషల్ మీడియాలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు విమర్శల దశ దాటి చాలా కాలమే అయ్యింది. నిత్యం రకరకాల ఫోటోలు, నకిలీ వీడియోలు, నకిలీ వార్తలతో వాటి మద్య జరుగుతున్న పోరాటాలు చూసి సామాన్య ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారు… అని తెలిసినా ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. తగ్గితే శత్రువు చెప్పిందే జనాలు నమ్మేసి తమని తిరస్కరిస్తారనే భయం!
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా ఈరోజు మంగళగిరి ఏపిఎస్‌పీ బెటాలియన్‌లో సిఎం చంద్రబాబు నాయుడు పోలీసులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ ఓ మాటన్నారు.
“ఒక్కప్పుడు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికీ మనశాంతి లేకుండా పోతోంది. క్రిమినల్స్ కూడా సోషల్ మీడియాలోకి వచ్చేస్తున్నారు. వారు కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నారు.
వ్యక్తులను, వారి కుటుంబాలను టార్గెట్ చేసుకొని వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. సోషల్ మీడియా ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలతో ఆడుకుంటున్న అటువంటి క్రిమినల్స్‌ని పోలీసులే గుర్తించి ఎప్పటికప్పుడు ఏరి పారేయాలి. లేకుంటే సమాజం అల్లకల్లోలం అవుతుంది,” అని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
సమాజంలో కంటే సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్చ మరికాస్త ఎక్కువన్నట్లు కొందరు వ్యవహరిస్తుంటారు. విమర్శలు తప్పు కావు. కానీ ఆ పేరుతో ఇతరులను దూషించడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం అంటే భావ ప్రకటన స్వేచ్చ హద్దులు దాటేసినట్లే.
కనుక ఏ సాకుతో ఇతరుల జీవితాలతో ఆడుకుంటున్నా వారిపై పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. లేకపోతే అది ప్రభుత్వ బలహీనతగా భావింపబడుతుంది. అప్పుడు అరాచకం మరింత ప్రబలుతుంది. కనుక సోషల్ మీడియాలో స్వీయ నియంత్రణ పాటించని వారిని ఖచ్చితంగా ఏరి పారేయాల్సిందే.




