చంద్రబాబు ఆదేశించారు! డీజీపీ ఆచరించారు!

chandrababu warns call money cheatersకాల్ మనీ, కల్తీ మద్యం వ్యవహారంలో ఎంతటివారినైనా విడిచి పెట్టేది లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కాల్ మనీ బాధితులకు అండగా వుంటామన్న సీఎం, ఎవరూ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా ఆగడాలకు పాల్పడితే తాట తీస్తామని హెచ్చరించారు. వేధింపులు తక్షణం ఆపకుంటే నిర్భయ చట్టాన్ని ప్రయోగిస్తామని, తప్పుడు పనులు చేసేవారు భయపడేలా చర్యలు వుంటాయని అన్నారు. విజయవాడలో సోమవారం కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ఏపీని కుదిపేస్తున్న కాల్‌మనీ వ్యవహారంపై ఆయన స్పందించారు. నిందితులు ఎవరైనా సరే చట్టాన్ని ఎదుర్కోవాల్సిందేనన్నారు. ఈ తరహా చర్యలను నవ్యాంధ్ర నూతన రాజధాని ఇమేజ్‌ను దెబ్బతీస్తాయని, వీటిని ప్రాథమిక దశలోనే అణిచివేసే అవసరం వుందన్నారు.

ఈ వ్యవహారంలో పలువురు టీడీపీ ప్రజాప్రతినిధుల పేర్లు బయటకు వచ్చిన విషయం తెల్సిందే! ఐతే, వీరికి ఈ కేసుతో ప్రమేయమున్నట్లు తాము భావించడం లేదని పోలీసు బాస్ డీజీపీ జేవీ రాముడు వివరణ ఇచ్చారు. నిందితులు ఎంత పెద్ద వారైనా వదిలి పెట్టవద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తమను ఆదేశించినట్లు తెలిపారు. మహిళలను వేధించిన కాల్ మనీ ముఠాలను అరెస్ట్ చేసే వరకు విశ్రమించేదిలేదన్నారు. కొందరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై తాము కొంతమంది అనుమానితులను కస్టడీలోకి తీసుకున్నామని, తాము నేరగాళ్లపై కొత్త క్రిమినల్ సవరణ చట్టాన్ని (నిర్భయ) ప్రయోగించడానికి వెనుకాడబోమన్నారు.

ADVERTISEMENT

ఈ కేసులో ఎమ్మెల్యేల ప్రమేయం ఎవరిదైనా వుందేమో ఆరా తీయాల్సిందిగా తాను విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్‌ను, డీసీపీలను కోరానని తెలిపారు. ఐతే, ఇందుకు సంబంధించి నిర్థిష్టమైన సమాచారం ఏమీ లేదన్నారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులపై రాజకీయ ఒత్తిడి ఏమీలేదని కూడా స్పష్టం చేశారు. మహిళల నుంచి తమ రుణాలను రాబట్టుకుంటున్నామనే సాకుపై కొందరు వ్యాపారులు మహిళలను వేధిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందని అన్నారు. కొంతమంది నిందితులు పరారీలో వున్నారని వారిని పట్టుకునేందుకు స్పెషల్ పోలీసు టీమ్స్‌ని ఏర్పాటు చేశామని డీజీపీ వివరించారు.

ADVERTISEMENT
Latest Stories