మెగాస్టార్ చిరంజీవి వేసిన పునాది రాళ్ళపై మెగా కుటుంబం ఇండస్ట్రీలో బలంగా నిలబడిందనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. బలంగా నిలబడటమే కాకుండా అంతకంతకూ ఇంకా మెగా బిజినెస్ విస్తరిస్తూనే ఉంది. ఇటీవల అల్లు అరవింద్ హైదరాబాద్‌లో అల్లు స్టూడియోని నిర్మించడమే ఇందుకు తాజా ఉదాహరణ. మెగా కుటుంబం ఓ విదంగా తెలుగు సినీ పరిశ్రమను శాశిస్తోందని చెప్పవచ్చు. మెగా హీరోల టాలెంట్, బలమైన కుటుంబం సంబందాలే మెగా కుటుంబాన్ని ఈ స్థాయిలో నిలబెట్టి ఉంచాయని అందరికీ తెలుసు.
అయితే మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ మద్య విభేధాలు ఏర్పడ్డాయని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అల్లు అరవింద్ వాటిని ఖండించారు. తమ రెండు కుటుంబాలు పెరగడంతో వాటి మద్య ఇండస్ట్రీలో పోటీ ఏర్పడుతోందని అయితే ఎవరి పరిధిలో వారుంటూ ఈ ఆరోగ్యకరమైన పోటీని కొనసాగిస్తున్నామని అల్లు అరవింద్ స్వయంగా చెప్పారు. ఇలా సర్దిచెప్పుకొన్నప్పటికీ ఎప్పుడైతే పోటీ ఏర్పడిందో అప్పుడు ఘర్షణ, దూరం కూడా ఏర్పడటం అనివార్యమే.
అల్లు అరవింద్ స్థాపించిన ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ టాక్ షో ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. అది బాలయ్యలోని మరో కోణాన్ని ప్రజలకు, ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఎప్పుడూ గంభీరంగా ఉంటూ, సభలు, సమావేశాలలో ప్రసంగించడానికి తడబడే బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షోలో గలగలా మాట్లాడుతూ, ఇంత సరదాగా, అద్భుతంగా కార్యక్రమాన్ని నడిపిస్తుండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఆయన అభిమానుల ఆనందానికి హద్దులే లేవు.
అయితే చిరంజీవి, అల్లు అరవింద్ మద్య దూరం పెరిగిందని గుసగుసలు వినిపిస్తుండగా బాలయ్యతో అన్‌స్టాపబుల్ టాక్ షో ప్రారంభించడం కూడా చర్చనీయాంశమైంది. కానీ మొదటి సీజన్ జోరుగా హుషారుగా అందరినీ ఆకట్టుకొంటూ సాగిపోవడంతో ఈ విభేదాల ఊహాగానాలు క్రమంగా తగ్గిపోయాయి.
కానీ రెండో సీజన్ మొట్టమొదటి షోకి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లని ఆహ్వానించడంతో అందరూ మళ్ళీ మరోసారి ఉలిక్కిపడ్డారు. మొదటి షోకి వారిని ఆహ్వానించాలనే నిర్ణయం ఎవరిదైతేనేమి ఆ ఆలోచన సూపర్ హిట్ అయ్యింది. ఎంతగా అంటే నేటికీ ఆ మొదటి షోపైనే రాజకీయ చర్యలు కొనసాగుతున్నాయి. ఆ మొదటి షో క్లిప్పింగులనే నేటికీ ఆహా ఉపయోగించుకొంటోంది.
ఈ టాక్ షో సందర్భంగా అల్లు అరవింద్, బాలయ్యల మద్య బంధం దృఢపడటం సహజమే. అయితే రెండో సీజన్‌తో వారి మద్య బందం మరింత బలపడింది. అల్లు శిరీష్ హీరోగా చేసిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి ఆయన బాలయ్య హాజరవడం, ఆ కార్యక్రమంలో వారిరువురూ పక్కపక్కనే కూర్చొని కబుర్లు చెప్పుకోవడం చూస్తే అది అర్దం అవుతుంది.
ఇంతకాలం మెగా శిబిరంలో ఒకరిగా ఉన్న అల్లు అరవింద్ క్రమంగా బాలయ్యకు సన్నిహితంగా మెలుగుతుండటం మెగా ఫ్యామిలీ జీర్ణించుకోవడం చాలా కష్టమే. కానీ మెగా కుటుంబం దీనిని రాజకీయకోణంలో నుంచి చూస్తే చిరంజీవి-అల్లు అరవింద్ కుటుంబాల మద్య దూరం ఇప్పుడు నిజంగానే పెరిగే అవకాశం ఉంది. కానీ భోళాశంకరుడు వంటి బాలయ్యతో అల్లు అరవింద్ స్నేహాన్ని అర్దం చేసుకొంటే ఏ అపార్ధాలు ఉండవు.



