100 కోట్ల క్లబ్ లో ఖైదీ నంబర్ 150… మరి ప్రకటనేది..?

Chiranjeevi Khaidi No 150 into 100 Crore Clubపదేళ్ళ తర్వాత సిల్వర్ స్క్రీన్ పైన కనపడిన మెగాస్టార్ పంట పండే విధంగా సినీ అభిమానులు అనూహ్యమైన తీర్పును అందించారు. మురుగదాస్ కధతో వివి వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న “ఖైదీ నంబర్ 150”కి మెగా అభిమానులు బ్రహ్మరధం పట్టడంతో కలెక్షన్ల టాపిక్ మారుమ్రోగుతోంది. ముఖ్యంగా తొలిరోజు 47.70 కోట్లు గ్రాస్ కొల్లగొట్టిందని అల్లు అరవింద్ చేసిన ప్రకటన మెగా ఫ్యాన్స్ లో కొత్త ఉత్తేజానికి కారణమైంది. రెండవ రోజు మందగించిన కలెక్షన్స్ మళ్ళీ మూడవ రోజు నుండి పర్వాలేదనిపించే స్థాయిలో రావడంతో… మొత్తమ్మీద తొలి 5 రోజులకు గానూ 100 కోట్లు పైనే గ్రాస్ వసూలు చేసిందని సోషల్ మీడియాలో హోరెత్తుతున్న అంశం.

అయితే నిర్మాత నుండి అధికారిక ప్రకటన ఏది? అన్న విషయం మాత్రం అంతుపట్టడం లేదు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంపై సోషల్ మీడియాలో గానీ, ప్రెస్ మీడియా ద్వారా గానీ నిర్మాతలు అధికారిక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు. మరి మెగాస్టార్ ప్రతిష్టాత్మక సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరితే, ఎలాంటి ప్రకటన చేయకపోవడం అభిమానులకు విస్మయాన్ని కలిగిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మరికొద్ది రోజుల్లో… మెగా ఫ్యాన్స్ కు, సినీ అభిమానులను ఉద్దేశిస్తూ… ‘థ్యాంక్యూ మీట్’ ఏర్పాటు చేసే అవకాశముందని తెలుస్తోంది. బహుశా ఈ వేడుకలో ఏమైనా ప్రకటన ఉంటుందేమో చూడాలి. ఇలాంటి ఉత్సాహభరితమైన ప్రకటనలే ఫ్యాన్స్ ను మళ్ళీ మళ్ళీ సినిమాను చూసేలా చేస్తాయన్నది కాదనలేని అంశం.

ADVERTISEMENT

నిజానికి ఈ సినిమా బిజినెస్ ‘బాహుబలి’ స్థాయిలో జరగడంతో, డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి రావాలంటే ఆ స్థాయి వసూళ్లు రావాల్సిందేనని ట్రేడ్ వర్గాలు ముందుగానే స్పష్టం చేసాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే… ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ల ప్రకటన. ఆదివారం నాటికి 1.20 మిలియన్ కలెక్షన్స్ సాధించిన “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఇక నుండి తమకు వచ్చేవన్నీ లాభాలేనని ప్రకటన చేసారు. ఇదే ‘ఖైదీ’ విషయంలో మాత్రం లాభాలను చేరుకోవాలంటే 2.50 మిలియన్ కలెక్షన్స్ ను సాధించాల్సిన పరిస్థితి. చిరుకున్న క్రేజ్ రీత్యా భారీ పెట్టుబడులు పెట్టగా, ఇపుడు 100 కోట్లు గ్రాస్ సాధించినా కొన్ని ఏరియాల్లో ఇంకా లాభాల్లోకి చేరుకొని పరిస్థితి. అయితే 150వ సినిమా 150 కోట్ల క్లబ్ లోకి చేరుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories