తన 150వ సినిమా “ఖైదీ నంబర్ 150”తో మెగాస్టార్ చిరంజీవి దశ తిరిగినట్లుగా కనపడుతోంది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా సూపర్ సక్సెస్ కొట్టగా, ఇటీవలే చిరంజీవి ‘వాయిస్ ఓవర్’ అందించిన “ఘాజీ” సినిమా అంతకు మించిన సక్సెస్ ను చవిచూస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై ఈ రేంజ్ లో హల్చల్ చేస్తుంటే, బుల్లితెరపై కూడా మెగాస్టార్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం ద్వారా వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఒక దాని వెనుక మరొకటి విజయవంతమైన కార్యక్రమాలతో సందడి చేస్తోన్న మెగాస్టార్, మార్చి 3వ తేదీన మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన “గుంటూరోడు” సినిమాకు మెగాస్టార్ చిరంజీవి ‘వాయిస్ ఓవర్’ అందించడంతో ఈ సినిమా మెగా అభిమానుల చూపులు కూడా పడ్డాయి. దీంతో తన ఖాతాలో ఖచ్చితంగా ఓ హిట్టు పడుతుందనే ఆశతో మంచు మనోజ్ ఉన్నట్లుగా కనపడుతోంది. ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కిందన్న విషయాన్ని ధియేటిరికల్ ట్రైలర్ స్పష్టం చేయగా, దీనికి చిరు వాయిస్ కూడా తోడైతే, విజయం వరించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరి మెగాస్టార్ స్వరం “గుంటూరోడు”కు ఏ విధంగా దోహదపడుతుందో, మార్చి 3వ తేదీన తేలనుంది.



