బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మీద చేసిన విమర్శలు తిరిగి కేటీఆర్ తో పాటు బిఆర్ఎస్ పార్టీని ఇరుకునపెట్టాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో ఒకటైన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ లో ఆంధ్రా కాంట్రాక్టర్ సీఎం రమేష్ కు సుమారు 1660 కోట్ల ప్రాజెక్ట్ పనులకు అవకాశం దక్కిందంటూ కేటీఆర్, రేవంత్ – రమేష్ పై పలు ఆరోపణలు చేసారు.
దీని పై స్పందించిన సీఎం రమేష్ కేటీఆర్ తో పాటుగా బిఆర్ఎస్ పార్టీని కూడా ఇరుకునపెట్టేలా కౌంటర్ అటాక్ చేసారు. రేవంత్ తానూ గతంలో టీడీపీ లో కలిసి పని చేశామని, మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదంటూ మండిపడ్డారు రమేష్.
అలాగే ఇద్దరి వ్యక్తుల మధ్య స్నేహం ఉంటే ముఖ్యమంత్రి స్థాయి వారు కాంట్రాక్టులు కట్టబెట్టేస్తారా.? గత పదేళ్లు కేసీఆర్ అలాగే తనవారికి మాత్రమే కాంట్రాక్టు పనులు అప్పగించారా.? వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తాయనే భయం కేటీఆర్ ను వేటాడుతుంది,
అందులో భాగంగానే ఆంధ్రా, తెలంగాణ అంటూ తిరిగి రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ చిచ్చుకి ఆజ్యం పోస్తున్నారు. గతంలో కవిత లిక్కర్ స్కాములో అరెస్టయ్యి తీహార్ జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ ఢిల్లీలోని తన ఇంటికి వచ్చి కవితతో సహా అందరి పై అన్ని కేసులలో విచారణను ఆపేస్తే బీజేపీలో బిఆర్ఎస్ ను విలీనం చేస్తాము అంటూ ప్రతిపాదన తెచ్చారు అంటూ సీఎం రమేష్ కేటీఆర్ పై ఎదురుదాడికి సిద్ధమయ్యారు.
అలాగే తన ఆరోపణలకు సాక్ష్యాలుగా ఢిల్లీలోని తన ఇంటి సీసీ టీవీ ఫోటేజ్ ఇచ్చేందుకు కూడా తానూ సిద్ధమంటూ ప్రకటించారు. ఇక ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మాదిరి కేటీఆర్ కు కూడా చెల్లి రూపంలో ఇంటి పోరు చుట్టుకుందని, అందులో భాగంగానే ఇలా ఇతరుల మీద లేనిపోని రాజకీయ విమర్శలు చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారంటూ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు రమేష్.
ఇక గత పదేళ్లు కేటీఆర్ US, మాల్దీవ్స్ ఆయన ఎలా వెళ్లారో, ఎం చేసారో కూడా తనకు బాగా తెలుసునని…ఆ వివరాలు భయటపెట్టినా, లేక బీజేపీలో బిఆర్ఎస్ విలీన మంతనాలు బయటకొచ్చినా కేటీఆర్ బిఆర్ఎస్ క్యాడర్ ముందు దోషిగా నిలబడాల్సి ఉంటుందంటూ రమేష్ కేటీఆర్ కు కౌంటర్ ఇస్తూ బిఆర్ఎస్ ను ఎన్ కౌంటర్ చేస్తున్నారు.
అయితే గతంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కవిత కూడా ఈ బిఆర్ఎస్, బీజేపీ విలీనం ప్రక్రియ మీద పలు ఆరోపణలు చేసిన సందర్భంగా రమేష్ చేస్తున్న వ్యాఖ్యలకు మరింత బలం చేకూరుతుంది.






