ఏడాది పాలన : రేవంత్ నిరూపించుకున్నాడా.?

Revanth Reddy

తెలంగాణాలో అధికారం చేతులు మారి నేటికీ ఏడాది పూర్తి అయ్యింది. అయితే గత ప్రభుత్వమైన బిఆర్ఎస్ పై అలుపెరుగని పోరాటం చేసిన రేవంత్, కేసీఆర్, కేటీఆర్ తీరును ఎండగట్టి ప్రజల ఆశీర్వాదం తో పాటు పార్టీ అధిష్టానం ఆశీస్సులు పొందారు.

అయితే గడిచిన ఏడాదిలో రేవంత్ మార్క్ రాజకీయం నడిచిందా.? లేక కాంగ్రెస్ మార్క్ పాలన కనపడిందా.? అనే ప్రశ్నకు బలమైన సమాధానం చెప్పలేము. గత ప్రభుత్వ హయాంలో ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ తన శాఖ అభివృద్ధితో హైద్రాబాద్ బ్రాండ్ వాల్యూ ను పెంచుకుంటూ పోయారు.

ADVERTISEMENT

కానీ ఇప్పుడు రేవంత్ నాయకత్వంలో ఉన్న ఐటీ మంత్రి సుధీర్ బాబు కేటీఆర్ స్థాయిలో పారిశ్రామిక వేత్తలను ఆకర్షించలేకపోతున్నారు, హైద్రాబాద్ అభివృద్ధిని విస్తరించలేకపోతున్నారు అనే అభిప్రాయం వినపడుతుంది. దీని తోడు హైడ్రా తో కూల్చివేతల ప్రభుత్వంగా రేవంత్ సర్కార్ పేద, మధ్యతరగతి ప్రజల ఆగ్రహాన్ని చవిచూసింది.

అలాగే ఎన్నికల హామీలలో ఇచ్చిన పథకాల అమలు కూడా విషయంలో కూడా లబ్ధిదారులు పూర్తి స్థాయిలో సంతృప్తి కరంగా ఉన్నారని చెప్పలేని పరిస్థితి. రైతు రుణ మాఫీ విషయం నుండి ఉచిత కరెంట్ వరకు అందరిదీ ఇదే పరిస్థితి. ఉచిత బస్సు తో మహిళలకు లబ్ది చేకూరినా ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు.

అలాగే బంగారు తెలంగాణ తెస్తాను అంటూ చెప్పిన కేసీఆర్ తన అధికారంతో తన కుటుంబ సభ్యుల జీవితాలను బంగారు మయం చేసుకున్నారు అంటూ ఆరోపించిన రేవంత్..కేసీఆర్, కేటీఆర్, కవిత ల మీద అనేక అవినీతి ఆరోపణలు చేసారు. అయితే వాటికి సంబంధించిన ఏ ఒక్క విషయంలోనూ ఆధారాలు బయటకు తీసి కాంగ్రెస్ ప్రభుత్వం తన దూకుడు చూపించలేకపోయింది.

దీనితో ఆ ఆరోపణలన్నీ రాజకీయ ఆరోపణలుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా రేవంత్ తన ఏడాది పాలన సమయాన్ని పూర్తి చేసుకున్నప్పటికీ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఇంకా తన ప్రయాణాన్ని ఇప్పటికి మొదలుపెట్టనే లేదు. బిఆర్ఎస్ నుండి కేటీఆర్, హరీష్ రావు లు మాత్రమే రేవంత్ సర్కార్ పై దూకుడుగా ముందుకెళ్తున్నారు.

ఇక బీజేపీ విషయానికి వస్తే నెలకో విమర్శ, మూడు నెలలకో నిరసన అన్నట్టుగానే గుట్టు చప్పుడు కానీ రాజకీయం చేస్తుంది. ఎన్నికల హామీలన్నీ నెరవేర్చి, పూర్తి స్థాయిలో ప్రతిపక్షాన్ని ఎదుర్కొని, ఐటీ రంగంలో హైద్రాబాద్ స్థాయిని మరో లెవెల్ కి తీసుకెళ్లి, అటు రైతులలో ఇది మన ప్రభుత్వం అనే గుర్తింపు తెచ్చుకునేలా చేసుకోగలిగితే తెలంగాణ రాజకీయాలలో ఇది రేవంత్ మార్క్ పరిపాలన అని నిరూపించుకున్నవాడవుతాడు.

ADVERTISEMENT
Latest Stories