తమిళనాడు ఎన్నికల ఫలితాల తరువాత విజయ్ టీవీకే దేశ వ్యాప్తంగా అందరి ద్రుష్టిని ఆకర్షిస్తుంది. తమిళనాడు రాజకీయాలలో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల దశాబ్దాల రాజకీయానికి బ్రేకులు వేస్తూ విజయ్ టీవీకే తమిళ రాజకీయాలలో విజిల్ వేసింది.
విజయ్ తన తొలి ప్రయత్నంలోనే పార్టీని అధికారంలోకి తీసుకురావడం, పూర్తి మెజారిటీ రాకున్నా, కాంగ్రెస్, వీసీకే, కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అన్ని సంచనాలుగానే మారాయి. అయితే విజయ్ టీవీకే గెలుపులోనే కాదు తన పాలనా నిర్ణయాలలోను సంచలనాలను సృష్టిస్తుంది.
విజయ్ సీఎం పీఠం మీద కూర్చున్న నాటి నుంచి పాలనలో తనదైన మార్క్ చూపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు గాను తొలి నిర్ణయంగా స్కూల్స్, ప్రార్ధన మందిరాలు, హాస్పిటల్స్, బస్ స్టాండ్ వంటి పరిసరాలకు దగ్గర గా ఉండే మద్యం దుకాణాలను రెండు వారాలలోపు తొలగించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.
ఇక ఇప్పుడు అవినీతి నిరోధన మీద ద్రుష్టి పెట్టారు. ఇందుకు గాను ప్రభుత్వ ఆఫీసులలో పనులు చేయడానికి ఎవరైనా ప్రజల దగ్గర డబ్బులు లంచంగా డిమాండ్ చేస్తే అందుకు సంబంధించిన వీడియో ను షేర్ చేసిన వారికీ ప్రభుత్వం తరుపున లక్ష రూపాయిలు ఆర్థిక బహుమతి ఇస్తామంటూ విజయ్ సర్కార్ ప్రకటించింది.
ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో విజయ్ కు సీఎంగా మరింత క్రేజ్ పెరిగింది. అయితే రాజకీయాలలోకి కొత్తగా వచ్చిన వారు అందునా సినీ రంగంలో స్టార్ హీరో గా ఉన్న నేతలు ఇటువంటి నిర్ణయాలు ప్రకటిస్తే అవి కూడా సినిమాటిక్ ఫీల్ నే తీసుకొస్తాయి.
అయితే ఆ నిర్ణయాల అమలు క్షేత్ర స్థాయిలో ఏ మేరకు సాధ్యమవుతుంది అనేది రానున్న రోజులలో తెలుస్తుంది. ఏదిఏమైనా అధికారంలో ఉన్న నేతలు ఇటువంటి నూతన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వారి నాయకత్వం పట్ల వారి ప్రభుత్వం పట్ల ప్రజలలో నమ్మకం పెరుగుతుంది.
అలాగే ఇటు ప్రభుత్వ ఉద్యోగులలో కూడా లంచాల డిమాండ్ పట్ల భయం పెరుగుతుంది. నేటి సోషల్ మీడియా పవర్ కి రాజకీయ పార్టీల తలరాతలు కూడా తలకిందులవుతున్నాయి, ఇక కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులు సైతం సోషల్ మీడియా బలం ముందు తలవంచుతున్నారు.
అటువంటిది ఒక ప్రభుత్వ ఉద్యోగి తన పేరు ప్రతిష్టలను, గౌరవ మర్యాదలను, తన కుటుంబ ఆర్థిక భద్రతను పణంగా పెట్టి సోషల్ మీడియా కంటికి చిక్కాలనుకుంటారా.? అయితే విజయ్ నిర్ణయాలన్నీ క్షేత్ర స్థాయిలో బలంగా అమలు కావడానికి అంతే బలమైన ఒక వ్యవస్థ అంతకంటే బలంగా నడపగల సిబ్బంది ఉండాలి. అప్పుడే ఇటువంటి నూతన నిర్ణయాలు అనుకున్న ఫలితాలను అందిస్తాయి.




