విజయ్‌ సూటేస్తే మాస్.. జీపు నడిపితే మమ్మమ్మాస్

CM Vijay’s Cinematic Style Governance Goes Viral

విజయ్‌ దళపతిగా పేరొందిన కోలీవుడ్‌ హీరో తమిళనాడు సిఎం విజయ్‌గా రూపాంతరం చెందిన తర్వాత కొంత కాలంపాటు సినిమా వాసనలు గుబాళిస్తూనే ఉంటాయి. అయన ఏం చేసినా సినిమాటిక్ లేదా సినీ హీరో చేసినట్లే ఉంటుంది.

తమిళ రాజకీయ ఆనవాయితీకి భిన్నంగా ప్రమాణ స్వీకారానికి సూటు బూటు వేసుకురావడం ఇందుకు మొదటి ఉదాహరణ. రాత్రికి రాత్రి రాష్ట్రంలో పాఠశాలలు, గుళ్ళు, మసీదులు, చర్చిల సమీపంలోని మద్యం దుకాణాలు ఎత్తేయించేశారు.

ADVERTISEMENT

తాజాగా అత్యవసర వైద్య సేవల కోసం కొనుగోలు చేసిన జీపుని స్వయంగా డ్రైవ్ చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో సిఎంలు, డెప్యూటీ సిఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు ఇలా వాహనాలు డ్రైవ్ చేస్తుంటారు. కానీ కొత్తగా సిఎం అయిన విజయ్‌ వైద్య ఆరోగ్యశాఖకు చెందిన జీపుని టెస్ట్ డ్రైవ్ చేయడం, ఆ రాష్ట్రంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆయన కొత్తగా సిఎం పదవి చేపట్టారు కనుక ప్రజలను మెప్పించడానికి ఇటువంటి సినిమాటిక్ పనులు ఏవో చేస్తూనే ఉంటారు. ఒకవేళ ఆయనకు ఆ ఆలోచన లేకపోయినా ఇటువంటి పనులు సినిమాటిక్‌గానే ఉంటాయి. బహుశః మరికొన్ని వారాలు లేదా నెలలు ఈ క్రేజ్ ఉంటుంది. కనుక ఇలాంటి వైరల్ వీడియోలు, ఫోటోలు వస్తూనే ఉంటాయి.

విజయ్‌ ప్రమాణ స్వీకారం తర్వాత మూడు ఫైల్స్ సంతకాలు చేశారు. 1. ప్రతీ ఇంటికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా. 2. మహిళల రక్షణ కొరకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు. 3. మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు యాంటీ డ్రగ్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. వాటికీ చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కనుక త్వరలోనే ఈ మూడు వార్తలతో మరోసారి సిఎం విజయ్‌ హైలైట్ అవుతారు.

కానీ ప్రమాణ స్వీకారం చేయగానే ఖజానా ఖాళీగా ఉందని చెప్పేశారు. కనుక ఎన్నికల హామీల అమలు చేయడం ఆలస్యమైతే విజయ్‌ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడానికి ప్రతిపక్షాలు సిద్ధంగానే ఉన్నాయి.

ముఖ్యంగా రాష్ట్రంలో సరికొత్త రకం పాలన అందిస్తానని, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చేస్తానని విజయ్‌ ఎన్నికల ప్రచారంలో చెప్పినందున, అయన కొత్తగా ఏం చేసి చూపిస్తారోనని ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈలోగా విజయ్‌ ప్రభుత్వం కూలిపోతుందంటూ స్టాలిన్ చేసిన ప్రకటనని విజయ్‌ తేలికగా తీసుకోవడానికి లేదు. కనుక ఇవన్నీ చేస్తూనే ప్రభుత్వం కూలిపోకుండా జాగ్రత్త పడాలి. తన ప్రభుత్వంలో ఒకే ఒక అధికార కేంద్రం (పవర్ సెంటర్) ఉంటుందని.. అది తానేనని విజయ్‌ స్వయంగా చెప్పుకున్నారు. కనుక ఆయనే ఇవన్నీ చక్కబెట్టాల్సి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories