క్యాసినోలో అదృష్టచక్రం గిరగిర తిరుగుతూ ఎవరికి అదృష్టం తెచ్చిపెడుతుందో ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతం తాడేపల్లిలో అదృష్టచక్రం గిరగిరా తిరుగుతుంటే వైసీపి సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ తీవ్ర ఆందోళనతో బీపీలు పెంచేసుకొంటున్నారు. తాజాగా విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అదృష్టం పరీక్షించుకొంటున్నారు. ఎందువల్ల అంటే ఈసారి ఆయన సీటుకి ప్రముఖ హాస్య నటుడు అలీ ఎసరు పెట్టబోతున్నారట!ఆయనేమీ కామెడీ చేయడం లేదు.
నిజానికి ఆయన ఎన్నికలలో పోటీ చేయాలని, ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టాలని చాలా కాలంగా తహతహలాడుతున్నారు. అందుకే 2019 ఎన్నికలకు ముందే వైసీపిలో చేరారు. అప్పుడు టికెట్ ఇవ్వలేకపోయినా ఈసారి తనకు తప్పకుండా టికెట్ ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు.
అలీని కాదనడానికి జగన్‌కు అభ్యంతరం కనపడలేదు. అందుకే ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే గుంటూరు తూర్పు నుంచి పోటీ చేయాలనుకొన్నారు. అందుకే గుంటూరులో తన కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరిపించి దానికి స్థానిక ముస్లిం పెద్దలందరినీ అలీ ఆహ్వానించి ఘనంగా మర్యాదలు చేశారని చెప్పుకొంటారు.
కానీ ఆ సీతుని మళ్ళీ ఎమ్మెల్యే ముస్తఫా లేదా ఆయన కుమార్తెకు ఇవ్వాలని జగన్ నిర్ణయించుకోవడంతో అలీ కోసం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంని ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. అక్కడ కూడా ముస్లిం ఓటర్లు భారీగానే ఉన్నారు.
అలీకి సినీ నటుడుగా మంచిపేరు, పరిచయాలు కూడా ఉన్నాయి. పైగా అక్కడ టిడిపి నుంచి చాలా తీవ్రమైన పోటీ ఉంటుంది. కనుక అలీని అక్కడి నుంచి బరిలో దింపితే తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తారని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరైతే వెల్లంపల్లి పరిస్థితి?అంటే ఈసారికి పక్కన పెట్టేయడం లేదా ఎన్నికల గంట మ్రోగేలోగా మరెక్కడైనా సర్దుబాటు చేయవచ్చని తెలుస్తోంది. త్వరలోనే అలీ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఒకవేళ అలీని అక్కడ నుంచి వద్దనుకొంటే రాజమండ్రి రూరల్ లేదా అర్బన్ నుంచి బరిలో దింపడం ఖాయమేనని తెలుస్తోంది. కనుక ఆలీ నవ్వుతూనే ఎవరో ఒకరికి ఎసరు పెట్టయబోతున్నారన్న మాట! సో బీకేర్ ఫుల్ విత్ అలీ… నో కామెడీ!




