నాగబాబు విషయంలో లీకులు, కుప్పిగంతులు అవసరమా?

naga-babu-mlc

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ సోదరుడు నాగబాబు పదవి గురించి మీడియాలో వస్తున్న వార్తలు చూసి ప్రజలు నవ్వుకునే పరిస్థితి నెలకొంది.

మొదట ఆయనని రాజ్యసభకు పంపించబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.

ADVERTISEMENT

రెండు రోజుల క్రితం ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఓ కార్పొరేషన్ ఛైర్మన్‌ పదవితో సరిపెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామిగా ఉంది కనుక ఆ పార్టీ సీనియర్ నేత నాగబాబుకి ఏదో పదవి ఆశించడం సహజమే. సిఎం చంద్రబాబు నాయుడు కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

కనుక ఆయనకు ఏదో ఓ పదవి కట్టబెట్టడం పెద్ద కష్టం కాదు. కానీ ఈవిదంగా రోజుకో వార్త వస్తుంటే కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది?అని సందేహం కలుగకమానదు. ఏదో జరుగుతోందని వైసీపీ చెప్పక మానదు.

లోక్‌సభ ఎన్నికలలో అనకాపల్లి నుంచి పోటీ చేద్దామనుకున్న నాగబాబు బీజేపి కోసం త్యాగం చేశారు. కనుక అప్పటి నుంచి దానికి ప్రతిఫలంగా ఏదో ఓ పదవి ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ప్రతీసారి అనివార్య కారణాల వలన వేరేవారికి ఆ పదవులు కేటాయించాల్సి వస్తోంది.

కనుక చివరికి నాగబాబుకి పర్యావరణ శాఖకు సంబందించిన ఓ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి ఇవ్వబోతున్నట్లు ఈరోజు వార్త. ఆయన పదవి గురించి ఇదే చివరి వార్తా? లేదా రేపు మరో కొత్త వార్త వినిపిస్తుందో తెలీదు.

కూటమిలో మూడు పార్టీలు, వాటిలో అనేకమంది సీనియర్ నాయకులు ఉన్నందున పదవుల కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది.

ముఖ్యంగా టీడీపీ కష్టకాలంలో కూడా పార్టీని కాపాడుకోవడం కోసం ఎంతగానో కృషి చేసిన సీనియర్ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు అనేకమంది ఉన్నారు. కనుక వారందరినీ కాదని నాగబాబుకి రాజ్యసభ సీటు లేదా మంత్రి పదవులు కట్టబెట్టాలని ప్రయత్నిస్తే తప్పకుండా వారందరూ అసంతృప్తి చెందుతారు.

పదవుల కోసం పార్టీలో అంతర్గతంగా తీవ్రమైన పోటీ, ఒత్తిళ్ళ వల్లనే నాగబాబుకి ఇంతకాలం ఏ పదవి కేటాయించలేకపోయిన్నట్లు అర్దమవుతూనే ఉంది. అటువంటప్పుడు ఆయనకు ఫలానా పదవిలోకి తీసుకోబోతున్నామని మీడియాకు లీకులు ఇవ్వడం దేనికి?

తద్వారా ప్రజలకు, పదవుల కోసం ఎదురుచూస్తున్న వారికి తప్పుడు సందేశం వెళుతుంది కదా?నాగబాబు-పదవి వార్తలతో అసహనం కలుగుతుంది కదా?నాగబాబుకి ఫలానా పదవి అని వార్తలు వచ్చిన తర్వాత అది రాకపోతే ఆయనకీ అది అవమానం, అప్రదిష్టే కదా?కనుక ఆయన పదవి విషయంలో ఇదే చివరి వార్త అయితే ఆయనకు, కూటమికి మంచిది.

లేకుంటే ఇటువంటి అవకాశం కొరకే ఎదురుచూస్తున్న వైసీపీ సొంత మీడియా “కూటమిలో పవన్ కళ్యాణ్‌ మాటకు విలువ లేదా? నాగబాబుకి పదవి ఇవ్వకపోవడంతో చంద్రబాబు నాయుడుపై పవన్ కళ్యాణ్‌ తీవ్ర అసంతృప్తి,” వంటి హెడ్డింగ్స్ పెట్టి మసాలా స్టోరీలు వడ్డించేస్తుంది.

ADVERTISEMENT
Latest Stories