బీజేపీకి ఇంకా అనుమానమేనా? చచ్చిన పాముని చంపడం దేనికి?

BJP Congress

పాము కనిపిస్తే చంపుతారు. ఇది సర్వసాధారణంగా జరిగేదే. కానీ చచ్చిన పాముని చంపాలనుకుంటే అది అభద్రతాభావాన్ని సూచిస్తుంది. ఇప్పుడు బీజేపీ అదే చేస్తోంది. ఇప్పటికే దేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడి ఉంది. బీజేపీ చాలా బలపడింది.

కనుక ఈసారి 400కి పైగా ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే మళ్ళీ చంద్రబాబు నాయుడు (టిడిపి), నితీష్ కుమార్‌ (జేడీయూ) వంటి పాత మిత్రులను ఎన్డీయే కూటమిలో చేర్చుకుంటోంది కూడా. కనుక బీజేపీ ఇంకా బలపడింది.

ADVERTISEMENT

మరోపక్క ఇండియా కూటమిలో భాగస్వామి పార్టీల నేతలపైకి ఈడీ, సీబీఐ, ఐ‌టి శాఖలని ఉసిగొల్పుతూ కేసులు నమోదు చేయిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసే గెలిచే పరిస్థితి లేనే లేదు.

అర్వింద్ కేజ్రీవాల్‌, హేమంత్ సొరేన్, కల్వకుంట్ల కవిత వంటివారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించి దేశంలో ఏ పార్టీ కూడా బీజేపీని ఎదిరించే ఆలోచన చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కనుక దేశంలో బీజేపీకి ఎదురే లేదని చెప్పవచ్చు.

అయినప్పటికీ బీజేపీ ఇంకా చచ్చిన పాముని చంపిన్నట్లు ఎంతో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇంకా చావు దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీని చూస్తే బీజేపీకి ఇంకా అభద్రతాభావం కలుగుతోందన్న మాట!

బహుశః ఆ భయం లేదా ముందు జాగ్రత్తగా ఆదాయపన్ను శాఖ చేత కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలన్నీ ఫ్రీజ్ చేయించింది. రూ.200 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదాయపన్ను శాఖ కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేసింది.

అయినా బీజేపీ పెద్దలకు ఇంకా ఎక్కడో ఓ మూల కాంగ్రెస్‌ అంటే భయం, అభద్రతాభావం ఉండి ఉండవచ్చు. అందుకే 2017 నుంచి 2021 వరకు ఆదాయపన్ను బకాయిలు, వడ్డీ, జరిమానా కలిపి మొత్తం రూ.1,700 కోట్లు కట్టాలని ఆదాయపన్ను శాఖ నోటీస్ పంపించింది.

దీనిపై అభ్యంతరం చెపుతూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది కానీ హైకోర్టు కాంగ్రెస్‌ పిటిషన్‌ తిరస్కరించింది. దీంతో కాంగ్రెస్‌ ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టబోతోంది.

దీనిపై కాంగ్రెస్‌ సీనియర్ నేత జయరాం రమేష్ స్పందిస్తూ, “లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని పోటీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నంగానే మేము దీనిని చూస్తున్నాము. ఇది టాక్స్ టెర్రరిజమే. బీజేపీ తక్షణం మాపై ఈ టాక్స్ ఉగ్రవాదాన్ని మానుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము,” అని అన్నారు.

తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేశానని భావించి పట్టించుకోవడం మానేసినందుకు అదే కాంగ్రెస్‌ చేతిలో ఓడిపోయి తన రాజకీయ పతనాన్ని కొనితెచ్చుకున్నారు. కనుక కాంగ్రెస్ పార్టీ చచ్చిన పాము వంటిదే అయినా ఇంకా ఇంకా చంపుతూనే ఉండాలని బీజేపీ పెద్దలు గట్టిగా నమ్ముతున్నట్లున్నారు. కానీ గతంలో కాంగ్రెస్‌ పార్టీ ఈవిదంగా వ్యవహరించినందుకే దేశప్రజలు గద్దె దించారని బీజేపీ పెద్దలు గుర్తులేన్నట్లు వ్యవహరిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories