ఏపీలో నిన్నటితో నామినేషన్ల గడువు ప్రక్రియ పూర్తి కావడంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు వారి వారి నామినేషన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని తమ ఎన్నిక అఫిడవిట్ ను సదరు అధికారులకు అందచేశారు. అయితే ఇందులో గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగబోతున్న కొడాలి నాని తన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు టీడీపీ నేతలు సదరు అధికారులకు ఫిర్యాదు చేసారు.
కొడాలి తన ఎన్నికల అఫిడవిట్ లో తాను ఎటువంటి ప్రభుత్వ భవనాన్ని వినియోగించలేదని వెల్లడించారు. దీనితో నాని నామినేషన్ వివాదంలో పడింది. కొడాలి నాని ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో ప్రభుత్వ భవనమైన మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంప్ కార్యాలయంగా వినియోగించారంటూ అందుకు తగ్గ సాక్ష్యాధారాలతో గుడివాడ టీడీపీ నేతలు కొడాలి పై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసారు.
భవనాన్ని అద్దెకు ఇచ్చినట్లుగా మున్సిపల్ అధికారులు ఇచ్చిన పత్రాలను ఆధారంగా చూపిస్తూ నాని తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, వెంటనే ఆయన పై చర్యలు తీసుకుని నాని నామినేషన్ ను తిరస్కరించాలంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు పై రిటర్నింగ్ అధికారి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోపోవడంతో టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు.
టీడీపీ నేతల ఫిర్యాదుని పరిగణలోకి తీసుకుని అధికారులు కొడాలి నామినేషన్ ను తిరస్కరిస్తే, ‘ఆహా..కొడాలి లేని అసెంబ్లీ ఊహించడానికే ఎంత ఆహ్లాదంగా ఉందో ఇక ఆచరణ సాధ్యమైతే బూతులు లేని అసెంబ్లీని’ చూడవచ్చు అంటూ సోషల్ మీడియాలో నాని పై సెటైర్లు పేలుతున్నాయి.




