ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లా మరో హాట్ స్పాట్ గా తయారయ్యింది. గత కొన్ని రోజులుగా జిల్లాలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 33 కొత్త కేసులు నమోదయ్యాయి, మొత్తం 2,051 కు చేరుకుంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 10 కేసులు నమోదయ్యాయి,
అలాగే కర్నూల్, నెల్లూరు జిల్లాల్లో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. తమిళనాడులోని కోయంబేడు అనే హోల్ సేల్ కూరగాయల మార్కెట్ కరోనా హబ్ గా తయారయ్యింది. ఇప్పటికే ఆ మార్కెట్ వల్ల తమిళనాడులో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా లో నమోదు అవుతున్న కేసులు దాదాపుగా ఆ మార్కెట్ వెళ్లిన వారివే.
ఇది ఇలా ఉండగా…. అత్యధిక కేసులు ఉన్న జిల్లాలలో మొదటి రెండు స్థానాలలో 584 కేసులతో కర్నూలు, 387 కేసులతో గుంటూరు ఉన్నాయి. 346 కేసులతో కృష్ణా పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. ఈ మూడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసులలో 66% ఉన్నాయి. ఇప్పటివరకూ… 46 మంది మరణించారు మరియు 1,056 మంది డిశ్చార్జ్ చేయగా, 949 క్రియాశీల కేసులు ఉన్నాయి.
మరోవైపు… కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 70,756. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన నాటి నుండి కేసులు పెరగడం గమనార్హం. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని సడలింపులు ఇస్తూనే ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఈ క్రమంలో ఆయన ఏం చెబుతారు అనేదాని మీద సర్వత్రా ఆసక్తి ఉంది.





