తెలంగాణలో మరీ ముఖ్యంగా కరోనా కేసులు పెరుగుతూ పోతున్నాయి. నిన్న రాత్రి వచ్చిన మెడికల్ బులెటిన్ ప్రకారం 1,551 కేసులు నమోదు అయ్యాయి. టెస్టులు తక్కువగా చెయ్యడం వల్లే తెలంగాణలో కేసులు తక్కువగా ఉన్నాయని, వాస్తవానికి ఇంకా ఎక్కువ కేసులు ఉండేవని పలువురు అంటున్నారు. అయితే మొత్తం దేశంలో అత్యల్ప టెస్టులు చేసిన రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉండటమైతే వాస్తవం.
కేసుల సరళిని పరిశీలిస్తే… కేసులు అన్నీ కస్టర్లుగా పెరుగుతున్నాయి. మంగళ్ హాట్ లో ఒక బ్యాంకు మేనేజర్ కుటుంబం ఒకటే బాత్ రూమ్ ని వాడింది. ఆ కుటుంబంలో పదిహేను మందికి కరోనా వచ్చింది. దూల్ పేటలో ఈ నెల 16న లాక్ డౌన్ ని ఉల్లంఘించి ఒక ఎంగేజ్మెంట్ చేశారు. దానికి 200 మంది హాజరయ్యారు…. అందులో పదహారు మంది పాజిటివ్.
అలాగే మాదన్నపేటలోని ఒక అపార్టుమెంట్ లో బర్త్ డే ఫంక్షన్ జరగగా… దానికి హాజరైన ఇరవై ముగ్గురికి కరోనా పాజిటివ్. ఈ కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీని బట్టి లాక్ డౌన్ ఉల్లంఘన జరిగిన ప్రతీ సారీ దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇటువంటి తరుణంలో లాక్ డౌన్ కు మరిన్ని సడలింపులు ఇస్తున్నారు.
తెలంగాణలో రేపటి నుండి కంటైన్‌మెంట్ జోన్లు మినహా అన్ని జిల్లాలో బస్సులు నడపడానికి సిద్ధం అవుతున్నారు. జాగ్రత్తలు పాటించాలి అని ప్రభుత్వం అంటున్నా ప్రజలు ఎంతవరకు పాటిస్తారో తెలీదు. లాక్ డౌన్ సడలింపు అనేది మునుముందు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.





