ఆక్సఫర్డ్ టీకా ధర రూ. 1000 వరకూ ఉండొచ్చంటూ సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ ఆధార్ పూనావాలా గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు అదే టీకాను కేంద్ర ప్రభుత్వానికి 250 రూపాయిల టోకు ధరకు ఇవ్వాలని సీరం నిర్ణయించుకున్నట్టు సమాచారం. దానికి సంబంధించిన ప్రపోజల్ ఇప్పటికే కేంద్రం వద్ద పెట్టినట్టు తెలుస్తుంది.
టీకా పంపిణీ విషయంలో తొలి ప్రాధాన్యం భారత్‌కే అని సీరం గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలంటూ సీరం ఇటీవలే ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. అయితే ఇప్పటివరకు దాని మీద కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.
ఇతర దేశాలలో టీకాల పంపిణీ మొదలయ్యాకా అక్కడి పరిస్థితిని బట్టి భారత్ లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పంపిణీ ఎప్పుడు మొదలైనా మొదటగా.. వ్యాక్సిన్‌ను 3 కోట్ల మంది హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అందించనున్నట్లు కేంద్రం ఇప్పటికే చెప్పింది.
ప్రస్తుతం భారత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు లక్షల కంటే తక్కువగా ఉంది. మొత్తం కరోనా కేసుల సంఖ్యలో యాక్టివ్ కేసుల సంఖ్య కేవలం 4 శాతం మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. గత సెప్టెంబర్ నెల మధ్య కాలం నుంచి భారత్‌లో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ రావడం కొసమెరుపు.





