వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఏవిదంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో సహా కొందరు ముఖ్యనేతలను ఎన్నికలలోగా రాజకీయంగా చావుదెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారో అందరికీ తెలుసు. టిడిపి కూడా తమ పట్ల చాలా అనుచితంగా మాట్లాడుతున్న కొందరు మంత్రులు, వైసీపి ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికలలో ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తోంది.
టిడిపి జాబితాలో ఉన్న వైసీపి నేతలలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఒకరు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌ల గురించి, వారి కుటుంబాల గురించి కొడాలి నాని ఎంత దారుణంగా మాట్లాడుతారో అందరూ వింటూనే ఉన్నారు. కనుక వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో కొడాలి నానిని ఓడించి తీరాలని టిడిపి చాలా పట్టుదలగా ఉంది.
అందుకే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు 4-5 నెలల ముందుగానే వెనిగండ్ల రాముని గుడివాడ టిడిపి అభ్యర్ధిగా ఖరారు చేస్తూ, నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమించారు. ఆయనకు పార్టీలో సీనియర్ నేతలు కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పిన్నమనేని వేంకటేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకల్లా బుల్లయ్య తదితరులందరూ మద్దతు ప్రకటించి, ఆయన గెలుపు కోసం అప్పుడే గుడివాడ నియోజకవర్గంలోని వరుసపెట్టి సభలు, పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
శనివారం నియోజకవర్గం పరిధిలోని మల్లాయపాలెంలో టిడిపి కార్యకర్తలు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, “తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్వర్గీయ ఎన్టీఆర్ పోరాడగా, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు.
ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదన్నట్లు తమ అధినేత రాష్ట్రం పరువు తీస్తుంటే, ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్టీఆర్ సొంత నియోజకవర్గమైన గుడివాడలో క్యాసినో నిర్వహించి ఆంధ్రుల పరువు తీసేశాడు. అసలు ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన గుడివాడ నుంచి ఇటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా అనర్హుడు.
టిడిపి హయాంలో పేద ప్రజల కోసం ప్రభుత్వం కట్టించిన టిడ్కో ఇళ్ళను కూడా కొడాలి నాని వదిలిపెట్టలేదు. మంత్రిగా ఉన్నప్పుడు వాటన్నిటినీ తన గుప్పెట్లో పెట్టుకొని అయినకాడికి పేదల నుంచి దండుకొని వారిని కూడా దోచుకొన్నారు. ఈ నాలుగున్నరేళ్ళలో గుడివాడలో ఒక్క ఫ్లైఓవర్ కాదు కదా … కనీసం రైల్వే ఓవర్ బ్రిడ్జిని కూడా నిర్మించలేకపోయారు.
రాష్ట్రంలో 174 నియోజకవర్గాలది ఓ లెక్క… గుడివాడ ఒక్కటి మరో లెక్క. త్వరలో జరుగబోయే ఎన్నికలలో కొడాలి నానికి డిపాజిట్ కూడా రాకుండా ఓడించి బుద్ధి చెప్పాలి. గుడివాడ పట్టణాన్ని అభివృద్ధి చేయాల్సిన ఎమ్మెల్యే కొడాలి నానియే పట్టణం పాలిట సైంధవుడిలా తయారయ్యాడు. కనుక రాష్ట్ర స్థాయిలో వైసీపిని, గుడివాడలో కొడాలి నానిని ఓడించి ఇంట్లో కూర్చోపెడితే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడ పట్టణం బాగుపడవు, “ అని అన్నారు.




