విజయ్ దేవరకొండ సినిమాలకు ఇప్పుడు తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ ఇమేజ్ ఉంది. అర్జున్ రెడ్డి పుణ్యమా అని ఈయన అన్ని చోట్లా తన మార్కెట్ పెంచుకున్నాడు. దీన్ని పెంచుకోడానికి ఇప్పుడు ‘డియర్ కామ్రేడ్’ సినిమాను నాలుగు దక్షిణాది భాషల్లో విడుదల చేసాడు. రిలీజ్ కు ముందు బాలీవుడ్ సీనియర్ ఫిలింమేకర్ కరణ్ జోహార్ సినిమా చూసి బాలీవుడ్ రీమేక్ హక్కులు కొంటున్నటు ప్రకటించారు. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ రష్మిక పాత్రలో నటిస్తుందని కూడా వార్తలు వచ్చాయి.
ఈ సినిమాలో నటించడానికి కబీర్ సింగ్, అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ లో నటించిన షాహిద్ కపూర్ ఏకంగా నలభై కోట్లు అడిగాడని కూడా అన్నారు. అయితే డియర్ కామ్రేడ్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మిశ్రమ టాక్ వచ్చింది. విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ వల్ల ఓపెనింగ్స్ అయితే వచ్చాయి గానీ పూర్తి రన్ లో మహా అయితే యావరేజ్ గా నిలవొచ్చు అంటున్నారు. ఈ సినిమా అన్ని భాషలలో కలిపి దాదాపుగా 33 కోట్ల మేర బిజినెస్ చేసింది.
సినిమా ఎంత రాబట్టినా అది విజయ్ దేవరకొండ స్టార్ పవర్ ని బట్టే. బాలీవుడ్ లో అలా జరగాలని ఏమీ లేదు. ఈ క్రమంలో అసలు ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ చేసే అవకాశం ఉందా అని అనుమానం రాకతప్పదు. మరోవైపు కొందరు సినిమాకు ఎంతో కొంత హైప్ తీసుకుని రావడానికి ఈ బాలీవుడ్ రీమేక్ అనేది తెర మీదకు తెచ్చారని, అసలు అటువంటి ప్రతిపాదనే ఉండకపోవచ్చని అంటున్నారు. హైప్ కోసం ఏకంగా కరణ్ జోహార్ ని దింపడం సాధ్యమేనా?



