దేశ రాజకీయాల్లో ప్రస్తుతం డీలిమిటేషన్ అంశం కొత్త చర్చకు దారితీస్తోంది. ఓవైపు ఓటర్ల జాబితా సవరణ (SIR) పేరుతో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్, సీజేపీ వంటి పక్షాలు కేంద్రంపై పోరాటం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే డీలిమిటేషన్ అంశం తెరపైకి రావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
అసలు SIRపై ప్రతిపక్షాలు పోరాటం చేస్తున్న సమయంలోనే డీలిమిటేషన్ చర్చను ముందుకు తీసుకురావడం వెనుక బీజేపీ రాజకీయ వ్యూహం ఉందా? ఇప్పుడు ఇదే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది.
ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు మొదటి నుంచీ ఆరోపిస్తున్నాయి. ఈ ప్రక్రియపై ఎన్నికల సంఘాన్ని నిలదీస్తూ కాంగ్రెస్తో పాటు సీజేపీ వంటి సంస్థలు నిరసనలకు దిగాయి. అలాగే ప్రధాన ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం అటు కాంగ్రెస్ ఇటు కాక్రోచ్ జనతా పార్టీ ఎన్డీయే ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చాయి.
ఇలాంటి సమయంలో డీలిమిటేషన్ అంశం తెరపైకి రావడం యాదృచ్ఛికమా? లేక రాజకీయ వ్యూహంలో భాగమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభ స్థానాల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు వంటి అంశాలు తెరపైకి రావడంతో దేశ రాజకీయాల దృష్టి ఒక్కసారిగా అటువైపు మళ్లింది.
ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో SIRపై పోరాడుతున్న ప్రతిపక్షాలు ఇప్పుడు డీలిమిటేషన్పైనా గళం విప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడే బీజేపీ రాజకీయ వ్యూహంపై చర్చ జరుగుతోంది.
ఇప్పటివరకు SIR చుట్టూ తిరిగిన రాజకీయ పోరాటం ఇప్పుడు డీలిమిటేషన్ వైపు మళ్లింది. దీంతో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తమ ఆందోళనలను రెండు అంశాలపై కొనసాగించాల్సి వస్తోంది.
ఒకవైపు ఓటర్ల హక్కుల పరిరక్షణ, మరోవైపు దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం.. ఇలా రెండు కీలక అంశాలు ముందుకు రావడంతో ప్రతిపక్షాల ఉద్యమంలో సహజంగానే దృష్టి చీలే అవకాశం ఉంది. ఇదే బీజేపీకి రాజకీయంగా కలిసొచ్చే పరిణామమా? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.
ఇప్పటికే ఎన్డీయే ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లుకు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రధాన రాజకీయ పార్టీలు టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీల నుంచి సంపూర్ణ మద్దతు లభించగా, అటు తెలంగాణ నుంచి బిఆర్ఎస్ కూడా బిల్లుకు అనుకూలం అంటూ అధికారిక ప్రకటన చేసింది. ఇక ఇటు తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డీఎంకే సైతం ఎన్డీయే ప్రతిపాదనకు పచ్చజెండా ఉంపింది.
ఈ నేపథ్యంలో ఇండియా కుటమి ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన సర్ ఉద్యమం నీరు కారే ప్రమాదం కనిపిస్తుంది. ఇప్పటికే సీజేపీ అజ్ఞాతంలోకి వెళ్లగా ఇప్పుడు కాంగ్రెస్ డీలిమిటేషన్ పై తన అభ్యంతరాలను వెలుగులోకి తెచ్చి ఈ బిల్లు కు వ్యతిరేకంగా గళం విప్పనుంది.
ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్ గా విమర్శలు మొదలుపెట్టారు. దీనితో ఇప్పుడు డీలిమిటేషన్ చర్చతో SIR ఉద్యమం వెనుకబడుతోందా? అన్న చర్చ మొదలయ్యింది.





