తమిళనాడులోని మధురై జిల్లాలో తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక మహా దీపం వెలిగింది. సుప్రీంకోర్టు కలుగజేసుకొని దీపం వెలిగింపజేయడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. బాణాసంచా కాల్చి తమ సంతోషాన్ని ప్రకటించారు.
మదురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపత్తూన్ (రాతి స్థంభం)కి సమీపంలో సికందర్ దర్గా ఉండటంతో కార్తీకదీపం వెలిగించే విషయంలో కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ వివాదాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టిలో పెట్టుకొని ఈ కార్తీక పౌర్ణమి రోజు ఒకసారి మాత్రమే దీపం వెలిగించేందుకు అనుమతించింది.
కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు కాలేదు. అప్పుడు కోర్టు ధిక్కరణ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నవంబర్ 28న తప్పనిసరిగా దీపం వెలిగించాలని ఆదేశించింది.
ఒకవేళ వెలిగించకపోయినా, వెలిగించేందుకు వెళుతున్నవారిని ఎవరైనా అడ్డుకున్నా తీవ్రమైన చర్యలు ఉంటాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది. తమ ఆదేశాలను పాటించనందుకు ఆలయ ధర్మకర్తల మండలిని సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది.
ఈ దీపం వెలిగింపజేసే బాధ్యత ఇద్దరు రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ వి. పార్థిబన్లకు అప్పగించి, కొండపై భద్రత కోసం సీఆర్పీఎఫ్ను కూడా నియమింపజేసింది. వారి పర్యవేక్షణలో నేడు కార్తీకదీపం వెలిగించారు.
ఇదివరకు అంటే జమ్మూ కశ్మీర్లో వేర్పాటువాదులు చెలరేగిపోతున్న రోజుల్లో శ్రీనగర్ లాల్ చౌక్ వద్ద క్లాక్ టవర్‌పై ఆర్మీ భద్రత నడుమ జాతీయ జండా ఎగురవేయాల్సిన దుస్థితి నెలకొని ఉండేది. ఇప్పుడు దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన తమిళనాడు రాష్ట్రంలో అదీ… మీనాక్షి అమ్మవారు కొలువైన మదురైలో ఇద్దరు రిటైర్డ్ న్యాయమూర్తులు, సీఆర్పీఎఫ్ జవాన్ల భద్రత నడుమ కార్తీక దీపం వెలిగించాల్సి వచ్చింది. ఏమనుకోవాలి?





