వైసీపి తుది జాబితా.. సెల్ఫ్ గోల్ చేసుకొని 175 మావే అంటారేమిటో?

Dharmana Prasada Rao Announce YSRCP MLA Candidates Final List

నేడు ఇడుపులపాయలో ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి సమక్షంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయబోయే వైసీపి అభ్యర్ధుల తుది జాబితా ప్రకటించారు. మొత్తం 175 ఎమ్మెల్యే సీట్లలో ఎస్సీ-29, ఎస్టీ-7, బీసీ-48, మైనార్టీ-7, మహిళలు-19 మందికి అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయమని మంత్రి ధర్మాన చెప్పారు. సమాజంలో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ తయారు చేసిన ఈ జాబితాని చదివే గొప్ప అవకాశం తనకు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందంటూ మంత్రి ధర్మాన జగన్మోహన్‌ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.

ADVERTISEMENT

అయితే తుది జాబితా ప్రకారం చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఏకంగా 32 మందిని, సిట్టింగ్ ఎంపీలలో 14 మందిని పక్కన పెట్టారనే విషయం ధర్మాన చెప్పలేదు. కానీ జాబితా చూస్తే అర్దమవుతుంది. ఇంతమందిని బయటపడేసి 175 సీట్లు మేమే గెలుస్తామని చెప్పుకోవడానికి చాలా ధైర్యమే ఉండాలి.

ప్రభుత్వంలో, పార్టీలో చివరికి టీటీడీలో రెడ్డి సామాజిక వర్గంతో నింపేసి అభ్యర్ధుల జాబితాలో సామాజిక న్యాయం చేశామని చెప్పుకోవడం వైసీపికే చెల్లునేమో?

టిడిపి యువనేత నారా లోకేష్‌ పోటీ చేయబోతున్న మంగళగిరి నుంచి మురుగుడు లావణ్య వైసీపి అభ్యర్ధిగా పోటీ చేయబోతున్నారు. గత ఎన్నికలలో వైసీపి ప్రభంజనం నెలకొని ఉంది కనుక నారా లోకేష్‌ ఓడిపోయారు. కానీ ఈసారి టిడిపి, జనసేనల ప్రభంజనం కనిపిస్తోంది. కనుక ఓడిపోబోయే మంగళగిరి సీటుని ఆమెకు కట్టబెట్టిన్నట్లు భావించవచ్చు.

వైసీపిలో కేవలం నోరు పెట్టుకొని ఐదేళ్ళు కాలక్షేపం చేసిన మంత్రులు రోజా, అంబటి రాంబాబు, ధర్మాన ప్రసాద రావు, సీదిరి అప్పల్రాజు, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, తమ్మినేని సీతారాం తదితరులకు జగన్‌ హ్యాండ్ ఇస్తారని అనుకున్నప్పటికీ జాబితాలో ఉంచారు.

ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలో చేర్చుకున్నారు కానీ తుది జాబితాలో ఆయన పేరు కనపడలేదు! టిడిపి, జనసేనల తొలి జాబితాలో తన పేరు కనపడనందుకే ఆయన అలిగి వైసీపిలో చేరిన సంగతి తెలిసిందే.

ఒకవేళ ఆయనకు జగన్‌ వేరే హామీలు ఏమైనా ఇచ్చినా ఉపయోగం లేదు. ఎందుకంటే, కేంద్ర ఎన్నికల కమీషన్‌ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తోంది కనుక తక్షణమే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసింది. కనుక అయితే గియితే వైసీపి మళ్ళీ అధికారంలోకి వస్తే, ఇస్తే లభిస్తాయి తప్ప ఇప్పుడు వెంటనే లభించేవి ఏమీ ఉండకపోవచ్చు.

కానీ ముద్రగడ పద్మనాభం మెడలో వైసీపి కండువా పడగానే జగన్‌ని ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగిడేశారు. కనుక జాబితాలో పేరు లేకపోయినా తప్పు పట్టలేరు…. పార్టీ వీడి బయటకు రాలేరు. వస్తే నవ్వులపాలవుతారు! ఆయన తెలిసి తెలిసీ ఆ గుమ్మంలో అడుగుపెట్టారు కనుక ఇక బుద్ధిగా లోపలే ఉండక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories