ఢిల్లీ లిక్కర్ స్కాం లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రముఖ పాత్ర అంటూ మీడియాలో కనిపించిన వార్త నుంచి ఆ తరువాత జరిగిన పరిణామాలన్నీ అనుకున్న స్థాయి కంటే వేగంగా ముందుకు కదిలాయి. దీనితో కేసీఆర్ ముద్దు బిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ కవిత అరెస్టు అనివార్యమయ్యింది.
అయితే కవిత అరెస్టు, తీహార్ జైలుకి తరలింపు, ఆ పై బైలు మీద బయటకు రావడం వంటి సంఘటనలతో బిఆర్ఎస్ లో కవిత రాజకీయం మందగించింది. కవిత అరెస్ట్ విషయంలో కేసీఆర్ నుంచి కేటీఆర్ వరకు అందరు మౌనంగా ఉండిపోవడం, బిఆర్ఎస్ పార్టీ తరపున కవిత కు రావాల్సిన నైతిక మద్దతు రాకపోవడం కవిత ను బిఆర్ఎస్ లో ఒంటరిని చేసాయి.
ఇదంతా ఇలా ఉంటే, కవిత లిక్కర్ కేసు ఆరోపణలు తెలంగాణలో బిఆర్ఎస్ ఓటమికి కారణమయ్యిందని, ఆమె అరెస్టు, జైలు పార్టీ ని రాజకీయంగా దెబ్బకొట్టిందనే భావన బిఆర్ఎస్ నుంచి వ్యక్తమయింది. అలాగే కవిత అరెస్టు తో ఇటు బీజేపీ – బిఆర్ఎస్ పార్టీల మధ్య విలీన ఒప్పందాలకు బేరసారాలు జరిగినట్టుగా, ఆ ప్రతిపాదనలను కవిత స్వయంగా తోసిపుచ్చినట్టు పలుమార్లు ప్రకటించారు.
అయితే నాడు కేసీఆర్ ని మానసికంగా దెబ్బకొట్టేందుకే, బిఆర్ఎస్ ని నైతికంగా బలహీన పరిచేందుకే తన పై బీజేపీ ఇటువంటి కక్ష్య పూరిత రాజకీయాలకు తెరలేపిందంటూ కవిత చేసిన ఆరోపణలను బీజేపీ తన చర్యలతో బలపరచాలనుకుంటుందా.?
కవిత అరెస్టు తో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా నాడు బీజేపీ రాజకీయం నడిపిందా.? అటు కవిత అరెస్టుతో బిఆర్ఎస్ కు జరగాల్సిన రాజకీయ నష్టం, కేసీఆర్ కి ఎదురవాల్సిన ఓటమి కష్టం రెండు ఒకే వేటులో లభించేలా బీజేపీ ముందుకెళ్ళిందా.?
అలాగే ఈ కేసు ప్రత్యక్ష ప్రభావం బిఆర్ఎస్ పై ఇలా ఉంటే పరోక్షంగా కవిత కేసు బిఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని మరికొన్ని చిక్కులలోకి నెట్టాయనే చెప్పాలి. కవిత బైలు తరువాత బిఆర్ఎస్ లో కేటీఆర్ – కవిత మధ్య ఆధిపత్య పోరుకి భీజం పడింది,
ఇక కేసీఆర్ మౌనం కల్వకుంట్ల కుటుంబంలో చీలిక తెచ్చింది, పార్టీ నుంచి కవిత సస్పెన్షన్ తో బయటకు వెళ్ళింది. ఈ పరిణామాల తరువాత ఇక కవిత లిక్కర్ కేసులో కిక్ పోయినట్టయ్యిందా.? అందుకే ఈ కేసుని బైలుతో పరిసమాప్తం చేస్తూ బీజేపీ వెనక్కి తగ్గిందా.? లేక బీజేపీ అంబుల పొదలో చిక్కిన మరో రాజకీయ అస్త్రంలా కవిత లిక్కర్ కేసు జమ్మిచెట్టు మీద దాచబడుతుందా.?




