రియో ఒలింపిక్స్ లో అద్భుత ప్రతిభ కనబరిచి పతకాన్ని సాధించిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఊహించని నిర్ణయం తీసుకుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా అందుకున్న బహుమతి బీఎండబ్ల్యూ కారును తిరిగిచ్చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ కారును మెయింటెయిన్ చేసే శక్తి తనకు లేకపోవడంతోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం.
దీపా కర్మాకర్ నివసించే అగర్తల రోడ్లపై ఖరీదైన బీఎండబ్ల్యూ కారును తిప్పడం చాలా కష్టం. గుంతలు, ఎత్తుపల్లాలతో కూడిన ఈ రోడ్లపై బీఎండబ్ల్యూ కారుని నడిపితే, అది పాడయ్యే అవకాశాలే ఎక్కువ. అలాగే, అగర్తలాలో బీఎండబ్ల్యూ సర్వీస్ సెంటర్ కూడా లేకపోవడంతో, ఈ బహుమతిని తిరిగిచ్చేయాలనే నిర్ణయానికి దీపా వచ్చిందని కోచ్ నంది తెలిపారు.
ఈ విషయాన్ని ఇప్పటికే చాముండేశ్వరినాథ్ దృష్టికి తీసుకెళ్లినట్టు, దీనికి ఆయన కూడా స్పందించారని… కారుని పంపితే, ఆ కారు ఖరీదుని దీపా అకౌంట్లో వేస్తానని తెలిపారని చెప్పారు. ఒలింపిక్ మెడల్ విన్నర్స్ అయిన పీవీ సింధు, దీపా కర్మాకర్, సాక్షి మాలిక్ లకు సచిన్ చేతుల మీదుగా చాముండేశ్వరి బీఎండబ్ల్యూ కార్లను బహూకరించిన సంగతి తెలిసిందే.



