ఓ ఎమ్మెల్యే పొరపాటున నోరు జారితేనే విమర్శల పాలవుతారు. ఊహించని చిక్కుల్లో చిక్కుకుంటారు. అలాంటిది యావత్ ప్రపంచ దేశాలను శాశిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోరు జారితే?అదీ ఒకసారో రెండుసార్లో కాదు… రోజూ నోరుజారుతుంటే?యావత్ ప్రపంచదేశాలు నవ్వుకోవా?
ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టడంతోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కనుక ఆయనకు మళ్ళీ వేరేగా గుర్తింపు అవసరమే లేదు. దాని కోసం ఆరాటపడక్కర లేదు. కానీ ఆరాటపడుతున్నారు. నోరు జారుతున్నారు. నవ్వుల పాలవుతున్నారు.
అమెరికా అధ్యక్షుడుగా తనదైన ముద్ర వేయాలనే కోరికతో సుంకాలు పెంచేశారు. హెచ్-1బీ వీసా ఫీజ్ పెంచేశారు. ఆంక్షలు విధించారు. నోబుల్ శాంతి బహుమతి అందుకోవాలనే తాపత్రయంతో రష్యా-ఉక్రెయిన్, భారత్-పాక్, ఇజ్రాయెల్-హమాస్, పాకిస్తాన్-అఫ్గనిస్తాన్ యుద్ధాలు నిలిపివేయాలని ప్రయత్నించారు.
కానీ అయన తీసుకున్న ప్రతీ నిర్ణయం బెడిసికొడుతూనే ఉంది. దీంతో పదేపదే యూ-టర్న్ తీసుకోక తప్పడం లేదు. వెనక్కు తగ్గక తప్పడం లేదు.
తన చొరవతోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నిలిచిపోయినట్లేనని గొప్పలు చెప్పుకున్నారు. కానీ మంగళవారం రాత్రే ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాలపై రష్యా దాడులు చేసి ధ్వంసం చేసింది.
పాకిస్తాన్-అఫ్ఘనిస్తాన్ యుద్ధం నిలిపేశానని ట్రంప్ చెప్పుకున్న 24 గంటలలోపే పాకిస్తాన్ వాయుసేన అఫ్ఘనిస్తాన్‌పై దాడి చేసింది. ఆ దాడిలో ముగ్గురు క్రికెటర్లతో 8 మంది చనిపోయారు.
వారం రోజుల క్రితమే ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, “ఇకపై రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదని మోడీ నాకు చెప్పారు,” అని చెప్పారు. కానీ మంగళవారం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలో పాల్గొనప్పుడు, “నేను మోడీతో మాట్లాడాను. ఇకపై రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేయదు,” అని ట్రంప్ అన్నారు.
ఈవిదంగా ట్రంప్ తొందరపడి ఏదేదో మాట్లాడేస్తూ, ఆ మాటలను ఆయనే వెనక్కు తీసుకుంటే లేదా మళ్ళీ యుద్ధాలు మొదలైతే జనం నవ్వరా?
అమెరికా అధ్యక్షుడు కొండపై కోతి కావాలంటే మరుక్షణం అయన గుమ్మం ముందుంటుంది. కానీ నోబుల్ శాంతి బహుమతి కోసం అయన ఎంత ఆరాటం ఆరాటపడినా అది ఆయనకు దక్కనే లేదు! కానీ దాని కోసం అయన పడిన ఆరాటం, మాట్లాడిన మాటలు విని అందరూ నవ్వుకున్నవారు. కానీ అది ఆయనకు దక్కకపోవడంతో అందరూ నవ్వుకోకుండా ఉంటారా?యావత్ ప్రపంచాన్ని శాశించగల స్థాయిలో ఉన్న ట్రంప్‌కి హుందాతనం ఇంకా ఎప్పుడు అలవడుతుందో?







