సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు ఎంత మేలు కలుగుతోందో అంతే హాని కూడా కలుగుతోంది. సోషల్ మీడియాలో ఓ పుకారు వస్తే చాలు… షేర్ మార్కెట్‌లో ఆ కంపెనీ షేర్లు విలువ పడిపోటుంది. సినిమాలు ఫ్లాప్ అవుతాయి. రాజకీయ నాయకుల జీవితాలు తారుమారు అయిపోతున్నాయి.
కనుక కత్తికి రెండు వైపులా పదునున్నట్లే సోషల్ మీడియాకి కూడా చాలా పదును ఉంది. దీని ప్రభావం దశాబ్దాలుగా ఉన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాపై కూడా పడుతుండటం విశేషం. వాటిలో వార్తలు వచ్చేలోగానే సోషల్ మీడియాలో వచ్చేస్తున్నాయి. కనుక మీడియా కూడా సోషల్ మీడియాలో ప్రవేశించక తప్పలేదు. కనుక అక్కడా వాటి మద్య యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి.
అయితే రాజకీయాలలో, సినీ పరిశ్రమలో విపరీతమైన పోటీ పెరిగిపోవడం వలన అనుచిత విధానాలు అవలభించడానికి ఇప్పుడు ఎవరూ వెనకాడటం లేదు. ఇప్పుడు ఏఐ కూడా అందుబాటులోకి రావడంతో ఓ ఫోటో, వీడియో లేదా చిన్న పుకారు పుడితే చాలు దానికి సోషల్ మీడియాలో చిలువలు పలువలు అల్లేసి లేనిది ఉన్నట్లు, జరగనిది జరిగినట్లు నమ్మిస్తున్నారు.
రాజకీయ పార్టీలు, నాయకులు తమ స్వలాభం కోసమో లేదా అనాలోచితంగానో ఏదో చేసినా, మాట్లాడినా దానిని వక్రీకరించడం పరిపాటిగా మారిపోయిందిప్పుడు.
ప్రజలకు నమ్మకం కలిగించేందుకు కొందరు కొన్ని ప్రముఖ పత్రికలలో ఈ వార్త వచ్చిందంటూ నకిలీ వార్తలు సృష్టిస్తుంటే, కొందరు ఆ పత్రికలలో వచ్చిన వార్తలను వక్రీకరిస్తున్నారు.
సాధారణంగా పెద్ద మీడియా సంస్థలకు విస్తృతమైన నెట్ వర్క్, సిబ్బంది ఉంటారు కనుక ఫోటోలు, వీడియోలు, సమాచార సేకరణకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ వాటిని కూడా అనేక వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో సంస్థలు, వ్యక్తులు అనుమతి లేకుండా వాడేసుకుంటున్నారు.
ఇదే కాపీరైట్ ఉల్లంఘన కాగా ఆ ఫోటోలు, వీడియోలు, సమాచారాన్ని వక్రీకరించడం ఇంకా నేరం. కనుక ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడు ఈ మేరకు హెచ్చరిక జారీ చేసింది. ఇటువంటి సంస్థలు, వ్యక్తులపై కాపీరైట్ యాక్ట్ కింద చట్టప్రకారం చర్యలు చేపడతామని హెచ్చరించింది.







