‘ఎపిక్’ సినిమా రివ్యూ: అర్థం లేని ప్రేమకథ!

Anand Deverakonda and Vaishnavi Chaitanya in Epic movie

చిత్రం: ఎపిక్

M9 రేటింగ్: 2/5

ADVERTISEMENT

విడుదల తేదీ: సెప్టెంబర్ 11, 2026

తారాగణం: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, శివాజీ, గవిరెడ్డి శ్రీనివాస్, కళ్యాణ్ శంకర్ తదితరులు

నిర్మాణ సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్ – ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్

దర్శకత్వం: ఆదిత్య హాసన్

సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్

నిర్మాత: సూర్యదేవర నాగవంశీ – సాయి సౌజన్య

ఛాయాగ్రహణం: అజీమ్ మొహమ్మద్

కూర్పు: నవీన్ నూలి

90’s వెబ్ సిరీస్ తో యావత్ ప్రేక్షకలోకాన్ని తనవైపుకు తిప్పుకున్న ఆదిత్య హాసన్ తెరకెక్కించిన సినిమా “ఎపిక్”. ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం అనౌన్స్మెంట్ టైంలో ఉన్న బజ్.. ట్రైలర్ కి రాలేదు. 90’s ప్రపంచం నుండి కచ్చితంగా ఇది ఎక్స్ పెక్ట్ చేయలేదు ఎవరూ. కాకపోతే ఆదిత్య బాగానే తీసి ఉంటాడులే అనే చిన్న నమ్మకంతోనే థియేటర్ దాకా వస్తారు జనాలు. ఆ నమ్మకాన్ని ఆదిత్య నిలబెట్టుకోగలిగాడా? లేదా? అనేది చూద్దాం..!!

కథ:
కుటుంబ బాధ్యత మొత్తం తండ్రి మీదే నడిచే ఓ మిడిల్ క్లాస్ తండ్రి (చంద్రశేఖర్)కి రెండో కొడుకు ఆదిత్య (ఆనంద్ దేవరకొండ). చిన్నప్పటినుండి వనపర్తి & ఫ్రెండ్స్ తప్ప ఏమీ తెలియకుండా పెరిగిన ఆదిత్య.. చదువు కోసం లండన్ వచ్చి, మొదటి రోజే కడలి (వైష్ణవి చైతన్య) అనే అమ్మాయిని ఇష్టపడి, ఆమెతో లివ్ ఇన్ లో ఉండడానికి సిద్ధమైపోతాడు.

ఆ తొలకరి పరిచయం.. తర్వాత ఎలాంటి పరిణామాలకి దారి తీసింది?, చివరికి ఏం జరిగింది? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు:

నటుడిగా ఆనంద్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ బాగుంది. సిగ్గు, బిడియం లాంటి ఎక్స్ ప్రెషన్స్ బాగా ప్రదర్శించాడు. ముఖ్యంగా కుర్రాళ్లకి ఉండే భయం, కన్ఫ్యూజన్ ని బాడీ లాంగ్వేజ్ లో ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది. కొన్ని సీన్స్ లో అతడి బీహివియర్ కి రిలేట్ అవుతాం కూడా. నటుడిగా మాత్రం ఆనంద్ మంచి మార్కులు సంపాదించుకున్నాడు.

వైష్ణవి చైతన్య పాత్రను మెచ్యూర్డ్ గర్ల్ గా ప్రెజెంట్ చేసినప్పటికీ.. ఎందుకలా బిహేవ్ చేస్తుంది? ఆమెకున్న కష్టం ఏమిటి? ఆమె తీసుకునే డెసిషన్స్ వెనుక కారణం ఏంటి? అనేది అసలు ఎక్స్ ప్లోర్ చేయలేదు. అందువల్ల ఆ పాత్రలో బలం ఉన్నా.. ఆ పాత్ర తీసుకునే డెసిషన్స్ & పాత్ర తాలూకు ఎమోషన్స్ తో కనెక్ట్ అవ్వలేం. వైష్ణవి లుక్స్ లో ఎక్కడా సిటీ అమ్మాయి అనే భావన కనిపించదు.

కళ్యాణ్ శంకర్ క్యారెక్టర్ సినిమాకి ప్లస్ పాయింట్. అతడి నటన, చెప్పే డైలాగ్స్ చాలా రిలేటబుల్ గా ఉంటాయి. ముఖ్యంగా రియాలిటీ చెక్ ఇచ్చే సీన్స్ బావున్నాయి. గవిరెడ్డి శ్రీనివాస్ కామెడీ ఫస్టాఫ్ వరకు వర్కవుట్ అయ్యింది. శివాజీకి ఒక్క ఫోన్ కాల్ సీన్ తప్ప చెప్పుకోదగ్గ సన్నివేశం ఒక్కటీ లేదు. మిగతా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అసలు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు.

సాంకేతికవర్గం పనితీరు:

దర్శకుడు ఆదిత్య హాసన్ 90’s వరల్డ్ నుండి ఒక క్యారెక్టర్ కథగా ఎపిక్ ను రాసుకోవడం, తీయడం అనేది సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. 90’s అనే సిరీస్ ఒక ఫినామినా. అసలు ఆ స్థాయిలో అందరూ రిలేట్ అయ్యే సిరీస్ ఈమధ్యకాలంలో మళ్లీ రాలేదు. అలాంటిది.. ఆ ప్రపంచం నుండి, అందరూ ఎంతగానో ఎంజాయ్ చేసిన ఆదిత్య అనే పాత్రతో సినిమా అంటే.. అందరూ ఆ ఛాయలు ఊహిస్తారు. “ఎపిక్”లో ఆ ఛాయలు ఉండవు అని ట్రైలర్ తోనే క్లారిటీ ఇచ్చినప్పటికీ.. ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ మాత్రం సెట్ చేయలేకపోయాడు.

ఆనంద్ పాత్రవరకు బాగానే ఉంది కానీ.. వైష్ణవి పాత్రలో ఉన్న బరువు, ఆ నటిలో కనిపించలేదు. అలాగని వైష్ణవి బాగా పెర్ఫార్మ్ చేయలేదు అని కాదు.. ఆ పాత్ర తాలుకు జర్నీ అనేది చూపించకపోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ అది. అందువల్ల.. రిలేటబుల్ గా ఉండాల్సిన ఆదిత్య-కడలిల ప్రేమకథ చాలా నార్మల్ గా ఉంటుంది. పరిచయం-ఇష్టం-తొలి ముద్దు-ప్రేమ-పెళ్లి అనే జర్నీలో ఎక్కడా సరైన ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు. ఆ కారణంగా.. ఏ పాత్రతో కనెక్ట్ అవ్వాలి? ఏ పాత్ర డెసిషన్ తో ట్రావెల్ అవ్వాలి? అనే క్లారిటీ ఆడియన్స్ కి ఉండదు. పోనీ ఫారిన్ కి చదువుకోవడం కోసం వెళ్లే విద్యార్థుల మైండ్ సెట్ & అక్కడ పరిస్థితులను రిలేటబుల్ గా చూపించాడా అంటే అదీ లేదు.

ఇక మెచ్యూర్డ్ గా పీరియడ్స్ & సెక్స్ గురించి డిస్కస్ చేశాను అని ఆదిత్య చెప్పుకున్న సీన్స్ కూడా చాలా పేలవంగా ఉన్నాయి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అమ్మ-అక్కతో పెరిగిన కుర్రాడికి ఓ ఆడపిల్ల నెలసరి నొప్పి తెలియకపోవడం అనేది 90’s ప్రపంచంలో సింక్ అవ్వలేదు. దాన్ని ఆ పాత్ర బెడ్ షీట్ మీద బ్లడ్ మార్క్ చూసి రియలైజ్ అవ్వడం, దాన్ని ఉతికి ఆరేయడం ఎపిసోడ్ మొత్తం చాలా మెటీరియలిస్టిక్ గా ఉంది కానీ.. అందులో సెన్సిబిలిటీ కనిపించలేదు.

అన్నిటికంటే ముఖ్యంగా.. హీరో క్లైమాక్స్ లో తీసుకునే డెసిషన్ అనేది చాలా సెల్ఫిష్ గా ఉంది. అలాంటప్పుడు హీరో యొక్క గ్రే షేడ్ ని నిజాయితీగా చూపించాలి కానీ, షుగర్ కోట్ చేయకూడదు. దానికి ఇచ్చిన రీజనింగులు కూడా చాలా సింపుల్ గా ఉన్నాయి. అందువల్ల.. వాటికి కూడా రిలేట్ అవ్వలేం. ఆ డెసిషన్ లో తప్పులేదు అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ.. ఇక్కడ మోరల్ చెక్ ఏమిటి? పెద్ద ప్రశ్న. సో, వెబ్ సిరీస్ దర్శకుడిగా, డైలాగ్ రైటర్ గా, నిర్మాతగా అలరించిన ఆదిత్య.. “ఎపిక్”తో సినిమా డైరెక్టర్ గా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.

హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం బాగుంది. సాహిత్యం కథను, పాత్రల భావాల్ని చక్కగా ప్రెజెంట్ చేసింది. సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది కానీ.. రూమ్ సెట్ విషయంలో ఆ బీచ్ లైట్ ను ఎవాయిడ్ చేసి ఉంటే.. అది గ్రీన్ స్క్రీన్ అనేది మరీ స్పష్టంగా తెలిసేది కాదు. చాలా తక్కువ బడ్జెట్ లో, మంచి ప్లానింగ్ తో తీశారు. ప్రొడక్షన్ డిజైనర్ & ఆర్ట్ టీమ్ ని మెచ్చుకోవాలి. ఎడిటింగ్ లో రిపీటెడ్ షాట్స్ ఉండడం అనేది బాలేదు. లండన్ వెళ్లి షూట్ చేసుకుని కనీసం రెండున్నర గంటల ఫుటేజ్ తీసుకోలేకపోయారా? అనిపించక మానదు. సాంగ్స్ కొరోయోగ్రఫీ లిరికల్ వీడియోస్ లో ఉన్నంత అందంగా తెరపై కనిపించలేదు. వాటిని సినిమాలో బ్లెండ్ చేసిన విధానం కూడా సింక్ అవ్వలేదు.

విశ్లేషణ:

ఒక ప్రేమకథలో లేదా ఇద్దరు జంట నడుమ వచ్చే సంఘర్షణలో వాస్తవికత ఎంత ఉండాలో.. ఆ వాస్తవికతను ప్రేక్షకులు అర్థం చేసుకుని, ఆ కథలోని ఎమోషన్ కి కనెక్ట్ అయ్యే కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా అదే స్థాయిలో ఉండాలి. కాన్ ఫ్లిక్ట్ అంటే అదేదో పెద్ద సమస్య కానక్కర్లేదు. బిహేవియర్ ఇష్యూస్ కావచ్చు, ఆటిట్యూడ్ ఇష్యూస్ కావొచ్చు, కాంపేటబిలిటీ కావచ్చు.. వాటిని ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు, వాటికి ఆడియన్స్ కనెక్ట్ లేదా రిలేట్ అవ్వగలుగుతున్నారా? అనేది చూసుకోవాలి.

అన్నిటికీ మించి పాత్రలు తీసుకునే డెసిషన్స్ తాలూకు ఎఫెక్ట్ ఆడియన్స్ ఫీలవుతున్నారా? అనే విషయంలో చాలా జాగ్రత్తపడాలి. ఒకరి ఆలోచనతో, నిర్ణయంతో మరొకరు ఏకీభవించాలి అనే రూల్ లేనప్పటికీ.. సినిమాగా చూపిస్తున్నప్పుడు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వాలి అనేది మాత్రం తప్పనిసరిగా పాటించాల్సిన రూల్. ఆ విషయంలో ఆదిత్య కేర్ తీసుకోకపోవడం, తన పర్సనల్ ఎక్స్ పీరియన్స్ లేదా చూసిన ఎక్స్ పీరియన్స్ ను సినిమాగా తీసి.. ఇందులో తప్పేం లేదు అని ప్రాజెక్ట్ చేయడం మైనస్ అయ్యింది.

ఆనంద్ నటన, హేషమ్ సంగీతం తప్ప చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్స్ లేని “ఎపిక్”కి ఆడియన్స్ రిలేట్ అవ్వడం అనేది కష్టం కాబట్టి.. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పెర్ఫార్మెన్స్ చాలా లిమిటెడ్ గా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.

ఓవరాల్ గా.. అర్థం లేని ప్రేమకథ!

M9 రేటింగ్: 2/5

ADVERTISEMENT
Latest Stories