ఫోక్ సాంగ్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వేములవాడలోని ఓ హోటల్ గదిలో ఉన్నప్పుడు, ఈశ్వర్ సాయి భార్య శరణ్య వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న వీడియో వైరల్ అయ్యింది. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మళ్లీ జోరుగా చర్చ మొదలైంది.
దీంతో ఇందులో ‘బాధితురాలు’ మాధురి రాథోడ్ అంటూ సోషల్ మీడియాలో కొందరు తీర్మానం చేసి, దానిని ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ఈశ్వర్ సాయి భార్య శరణ్య బయటపెట్టిన వారి అక్రమ సంబంధం వ్యవహారం పక్కకు వెళ్లిపోయింది.
బహుశా ఆ వాదనల నుంచి మాధురి రాథోడ్‌కు మంచి లీడ్ దొరికిందో.. లేక నిజంగానే ఈశ్వర్ సాయి ఆమెను మాయమాటలతో లోబరుచుకున్నాడో గానీ.. అతను తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను ఏఐ ద్వారా తన ప్రైవేట్ నకిలీ ఫొటోలు, వీడియోలు సృష్టించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది.
నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కానీ ఇంతవరకు ఈశ్వర్ సాయిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా అతనిని ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ మాధురి రాథోడ్ తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే సమయానికి కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి ఆమెను కాపాడారు.
సినీ పరిశ్రమలో నటీనటులుగా, యూట్యూబర్లుగా రాణించేవారు ఎంతమంది ఉన్నారో.. ఇటువంటి వ్యవహారాల్లో చిక్కుకొని జీవితాలను నాశనం చేసుకునేవారూ అంతే మంది ఉన్నారని ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారాన్ని చూస్తే అర్థమవుతుంది.
ఇలాంటి వ్యవహారంలో ఆమె పేరు, ఫొటోలు, వీడియోలు బయటపడటం వల్ల ఆమె పరువు, ఆమె తల్లిదండ్రుల పరువు, కుటుంబం పరువు దెబ్బతింటుంది. సమాజంలో తలెత్తుకొని తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో ఈశ్వర్ సాయి, అతని కుటుంబ పరువు కూడా బజారున పడుతుంది. అతని కెరీర్, వారి జీవితం రెండూ దెబ్బతింటాయి.
కనుక ఇలాంటి వ్యవహారాలకు అందరూ దూరంగా ఉండాలని చెప్పడం చాలా తేలిక. కానీ స్త్రీ, పురుషుల మధ్య సహజంగా ఉండే ఆకర్షణ లేదా వ్యామోహాన్ని జయించడం అంత సులభం కాదు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో అంత సన్నిహితంగా కలిసి పనిచేసేవారి మధ్య ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. అవకాశాలు, అవసరాలు ఉన్నప్పుడు ఇలాంటి కథలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి.
మరి ఈ వ్యవహారంలో అసలు బాధితులు ఎవరు? నిందితులు ఎవరు? వీటికి సమాధానం దర్యాప్తులోనే తేలాలి.





