కొన్ని సినిమాలకి ఎంతలా ప్రయత్నించినా కాంట్రవర్సీలు క్రియేట్ అవ్వవు, బజ్ రాదు. కానీ.. కొన్ని సినిమాలకి మాత్రం వద్దన్నా కాంట్రవర్సీలే. “ఇడుపు కాయితం” అనేది ఈ రెండో వర్గానికి చెందిన సినిమా. ఓపెనింగ్ అప్పుడే తెలుగులో డబ్బింగ్ చేస్తారా అని ఎవడో ఒకడు పెట్టిన కామెడీ ట్వీట్ కి ఏకంగా రెండు రాష్ట్రాల సోషల్ మీడియా జనాలు, రాజకీయ నాయకులు కొట్టుకుని సచ్చారు.
ఇప్పుడిప్పుడే అదంతా ఓ కొలిక్కి వచ్చింది అనుకుంటున్న తరుణంలో.. నిన్న ఆ సినిమా నుండి మరో పాట విడుదల కార్యక్రమంలో బన్నీ వాసు మాట్లాడుతూ.. “ తెలంగాణలో కూడా ఆంధ్రాలోలా పచ్చని పైర్లు ఉంటాయని అనుకోలేదు. అచ్చు మా ఊరులానే ఉంది” అంటూ చేసిన స్టేట్మెంట్ రాజకీయంగా హల్ చల్ సృష్టించింది. తెలంగాణలో పచ్చని పైర్లు ఉండవని ఎలా అనుకుంటావ్ అంటూ బన్నీ వాసుపై నిప్పులు చెరుగుతున్నారు చాలామంది.
అది సరిపోదన్నట్లు సినిమాలోని ఒక పాటలో పెళ్లి భోజనాల్లో.. బంతి భోజనాలు వడ్డిస్తూ మంచి నీళ్ల బదులు ఏకంగా మందు పోయడం అనేది తెలంగాణ సాంస్కృతిక పెద్దలు తప్పుబడుతున్నారు. తెలంగాణ సంస్కృతి అంటే ఎప్పుడూ మందు తాగడం, కొట్టుకోవడమేనా, ఇంకేం ఉండదన్నట్లు ఇదేం ప్రచారం అంటూ మండిపడ్డారు. ఆ సంస్కృతిని ప్రియదర్శి గొప్పగా చెప్పడం పట్ల కూడా అతడికి అక్షింతలు పడుతున్నాయి.
సినిమాకి ఓపెనింగ్ కి క్రియేట్ అయిన కాంట్రవర్సీకి ఆంధ్రా నుండి కౌంటర్ పడి, తెలంగాణ వాళ్లు సపోర్ట్ చేసుకుంటే. ఇప్పుడు డైరెక్ట్ గా తెలంగాణవాదులే సినిమా మీద విరుచుకుపడడం అనేది టీమ్ ఊహించి ఉండరు. మరి బన్నీ వాసు వీటిని పబ్లిసిటీలా భావించి లైట్ తీసుకుంటాడా? లేక వివరణ ఏదైనా ఇప్పిస్తాడా అనేది చూడాలి.





