ఏపీ ఎన్నికల్లో మజ్లిస్.. భవిష్యత్‌ రాజకీయాలకు తొలి సంకేతమా?

AIMIM candidates contest AP municipal elections

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణకు చెందిన మజ్లిస్ పార్టీ పోటీ చేస్తుండటం మరో కొత్త పరిణామం. ముస్లింలకు ప్రతినిధిగా చెప్పుకునే మజ్లిస్ పార్టీ, దేశవ్యాప్తంగా ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా వాటిలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, జిల్లాలు, నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని పోటీ చేస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కడప, హిందూపురం, విజయవాడలో పోటీ చేస్తోంది.

ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కడప మేయర్‌, హిందూపురం మున్సిపల్ చైర్మన్‌ పదవులకు అభ్యర్ధులను ప్రకటించారు.

ADVERTISEMENT

అలాగే విజయవాడలో-3 డివిజన్లు, ఆదోని-7, రాయదుర్గం-3, నంద్యాల-1, పెనుగొండ-1 వార్డుల్లో మజ్లిస్ అభ్యర్థులను బరిలో దించారు. హైదరాబాద్‌ నుంచి మజ్లీస్ ఎమ్మెల్యేలు వచ్చి వీరి తరపున ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టారు.

రాజకీయ పార్టీలు దేశంలో ఎక్కడ నుంచి అయినా పోటీ చేయవచ్చు. కనుక మజ్లీస్ పార్టీ ఏపీలో పోటీ చేయడం తప్పు కాదు.

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అది బలమున్న చోట పోటీ చేస్తుంటుంది. కానీ సార్వత్రిక ఎన్నికలలో మాత్రం ఒక్క హైదరాబాద్‌ లోక్‌సభ సీటుకు, 7-8 శాసనసభ స్థానాలకు మాత్రమే పోటీ చేస్తుంటుంది.

తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ, మజ్లీస్‌తో స్నేహం చేస్తుంటాయి. బహుశః అందుకే మజ్లిస్ తెలంగాణ అంతటా పోటీ చేయడం లేదా? లేక ముస్లిం జనాభా లేనిచోట పోటీ చేసి ప్రయోజనం ఉండదని పోటీ చేయడం లేదా? అంటే రెండూ అని చెప్పుకోవాల్సి ఉంటుంది.

మజ్లీస్ పార్టీ హైదరాబాద్‌, పాతబస్తీకే పరిమితమైనప్పటికీ, తెలంగాణలో ఎవరు అధికారంలో ఉన్నా తమ ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందేనని ఆ పార్టీ అధినేతలు ఓవైసీలు బహిరంగంగానే చెపుతుంటారు. అందుకు బలమైన కారణం కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు ఓవైసీలతో సఖ్యతగా ఉంటాయి.

ఆంధ్రాలో కూడా పలు జిల్లాలో ముస్లిం జనాభా ఉంది. కనుక తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలను కట్టడి చేస్తున్న మజ్లీస్ పార్టీ, ఏపీలో కూడా బలపడితే భవిష్యత్‌లో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలనుఅదేవిధంగా మజ్లీస్ కట్టడి చేయగలుగుతుంది.

ఇంతకాలం కుల రాజకీయాలు చేసుకుంటున్న పార్టీలు, అప్పుడు ముస్లిం ఓట్ల కోసం మజ్లిస్ చెప్పినట్టు వినాల్సి రావచ్చు. ఇది ఊహాజనితమే కావచ్చు. కానీ తెలంగాణ ‘రాజకీయ రిఫరెన్స్‌’తో చూస్తే అటువంటి అవకాశం ఉందని అర్ధమవుతుంది.

ADVERTISEMENT
Latest Stories