రెబెల్ స్టార్ కృష్ణంరాజు గారు ఈ మధ్యనే అనారోగ్యంతో స్వర్గస్తులైన విషయం అందరికి తెలిసిందే. ఆయన సినీ ప్రస్థానానికి వారసుడు ప్రభాస్ నేడు అయన సంస్మరణ సభ, కృష్ణంరాజు గారి సొంత ఊరైన మొగల్తూరులో ఏర్పాటుచేశారు. అభిమానులందరినీ, ఊరిప్రజలందరినీ పిలిచి కృష్ణంరాజుగారికి బాగా ఇష్టమైన మాంసాహార వంటకాలన్నీ వడ్డించారు. ప్రభాస్ అభిమానులందరినీ ఉద్దేశించి ” అందరూ కడుపునిండా తిని వెళ్ళండి డార్లింగ్స్ ” అని అన్నారు.
మొగల్తూరు లో కృష్ణంరాజు గారికి మంచి పేరుంది. అయన బీజేపీ తరుపున రాజకీయాల్లో చురుకుగా ఉన్నపుడు మొగల్తూరికి ఎంతో చేశారని అక్కడ చెప్పుకుంటారు. ఇక కృష్ణంరాజు గారి దానగుణం గురించి ఎంత చెప్పినా తక్కువే. మొగల్తూరులో కాలేజీ లైబ్రరీ విషయంలో మెగాస్టార్ చిరంజీవి, తన అమ్మమ్మ గారి ఇల్లు ఇవ్వడానికి నిరాకరించినపుడు కృష్ణంరాజు గారే కొంత స్థలాన్ని ఇచ్చారు.
Also Read – నాడు – నేడు ప్రజా నాయకుడేనా….
అసలు విషయం ఏంటంటే.. ప్రభాస్ ఏర్పాటు చేసిన విందులో కొంతమంది రాజకీయాల్లోకి రాజు వస్తే అందరి కడుపు నిండుతుంది అనే అర్ధం వచ్చేలా ఫ్లెక్సీలు పెట్టి అక్కడున్న చిరు,పవన్ కులం వారిని కదిపారు. మామూలుగానే గోదారోళ్ళు మాట త్వరగా వదిలేస్తారు. ఇక అక్కడ పెద్ద గొడవలే జరిగాయి. కొంతమంది అక్కడికక్కడే “ఈరోజు భోజనం పెట్టినట్లు రోజూ భోజనం పెడతారా ?” అని మొహం మీదే అడిగేస్తుంటే. ఇంకొంతమంది మొగల్తూరులో ఉన్న సమస్యలన్నీ ప్రభాస్ లాంటి రాజులొస్తేనే తీరుతాయని నొక్కి చెప్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం మీద అభిమానులు చర్చలు జరుపుతున్నారు.
కరోనా కాలమొచ్చి, అన్నింటికీ ధరలు పెరిగి, సరిగ్గా జనానికి తిండి కూడా దొరకని ఈ రోజుల్లో ..ప్రభాస్ లాంటి హీరో పిలిచి మరీ మాంసాహార భోజనం తినమంటే, తిని సంతోషించకుండా, ఎంత తిన్నా కడుపునిండని కొంత మంది రాజకీయ కుల చిచ్చులు రేపి, ఆకలి తీర్చుకోవాలనుకోవడం ధర్మమా ? ప్రభాస్ కి లేని ఆలోచనలు రేకెత్తించడం ఎందుకు? అయినా ప్రభాస్ ఈ రోజు పెట్టినట్లే రోజూ అందరికి భోజనాలు పెట్టగలడా? అభిమానులు కూడా ఆలోచించి అడుగేయాలి, లేకపోతే మితిమీరిన అభిమానం హీరోలకి చేదు అనుభవాలే మిగుల్చుతుంది.