దసరా పండుగ ఆఫర్లు…బిగ్ బిలియన్ డేస్ అంటూ ఆన్ లైన్ వెబ్ సైట్స్ లో 50 % నుండి 90 % వరకు ఆఫర్స్ సేల్ అందుబాటులో ఉంటాయి అంటూ ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి సైట్స్ లో ఆఫర్ల మోత మోగుతున్నాయి.
అయితే ఈ పండుగ ఆఫర్లు అన్ని కేవలం ఆర్డర్ల వరకు మాత్రమే పరిమితమవుతున్నాయి కానీ డెలివరీకి అందుబాటులో ఉండడం లేదు అంటూ వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. లూట్ సేల్, ఫ్లాష్ సేల్స్ అంటూ ఆన్ లైన్ కంపెనీలు వినియోగదారులను మోసం చేస్తున్నాయి అంటూ సోషల్ మీడియా బాట పట్టారు కంజ్యూమర్స్. ఆన్ లైన్ వెబ్ సైట్స్ ప్రజలను ఆఫర్లు రూపంలో చీటింగ్ చేస్తున్నాయి అంటూ మండిపడుతున్నారు.
బ్రాండెడ్ వస్తువులు అతి తక్కువ ధరలకు ఆఫర్ల రూపంలో అందుబాటులో ఉండడంతో వాటిని బుక్ చేసుకున్న కస్టమర్లుకు డెలివరీకి ముందే ఆ ఆర్డర్ క్యాన్సిల్ అయ్యింది, త్వరలోనే మీకు మీ నగదు రీ ఫండ్ చేయబడుతుంది అంటూ సదరు వెబ్ సైట్ నుంచి మెసెజ్ రావడం కస్టమర్ల సహనాన్ని పరీక్షిస్తుంది.
బిగ్ బిలియన్ డేస్ అంటూ ఫిలిప్ కార్ట్ వంటి ప్రజాదరణ పొందిన వెబ్ సైట్స్ ఇప్పుడు ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటుంది. దీనితో #flipcartscam హాష్ ట్యాగ్ తో వేలాది ట్వీట్లు చేస్తున్నారు వినియోగదారులు. తాము ఫలానా బ్రాండెడ్ షూ 90 %ఆఫర్లో ఆర్డర్ ప్లేస్ చేస్తే నాలుగు రోజుల డెలివరీ డేట్ చూపించి, మరుసటి రోజే తమ ఆర్డర్ క్యాన్సిల్ అయ్యింది అంటూ flipcart నుంచి మెసెజ్ రావడం వినియోగదారుల ఆగ్రహానికి కారణమయ్యింది.
కనీసం తమ ఆర్డర్ ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో కూడా తెలియచేయడానికి కస్టమర్ కేర్ సెంటర్లు కూడా అందుబాటులో ఉండడం లేదని వాపోతున్నారు. ఫ్లిప్ కార్ట్ చూపించే ఆఫర్లు అన్ని ఆర్డర్ల వరకే పరిమితం అవుతున్నాయి కానీ అవి డెలివరీకి నోచుకోవడం లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆక్రోశాన్ని వెళ్లబుచ్చుతున్నారు కొనుగోలుదారులు.
అసలు డెలివరీ చెయ్యలేని వస్తువులకు భారీ ఆఫర్లు పెట్టి ఆర్డర్ బుక్ చేసాక క్యాన్సిల్ చెయ్యడం పై ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం సమాధానం చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ లూట్ సేల్స్ వెనుక దాగున్న ఆఫర్ల కిరికిరి ఏమిటో, ఆర్డర్లు వేళల్లో ఉంటె డెలివరీలు పదుల సంఖ్యలో ఉండడం వెనుక ఉన్న ఆ మోసాన్ని కన్స్యూమర్ ఫారం అధికారులు వెలికి తీయాలనే డిమాండ్ వినపడుతుంది.




