అధికారాన్ని ఇచ్చేవి.. పీకేవి ఉచితాలేనా.?

Freebie politics hurting welfare and development

సమకాలీన రాజకీయంలో సంక్షేమ పథకాలకు – ఉచిత పంపకాలకు మధ్య ఉన్న చిన్న అంతరం పూర్తిగా తొలిగిపోయిందనే చెప్పాలి. అలాగే ఒకరకంగా ఆ గీతను కూడా తమ రాజాకీయ లబ్ది కోసం తమ అధికార దాహం కోసం రాజకీయ పార్టీలు ఆయా పార్టీల నాయకులే కనుమరుగు చేసారని చెప్పాలి.

అయితే సంక్షేమ పథకాలు అంటే ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం లేని వారికీ ప్రభుత్వాలు అందించే సాయాలు. అంతే కానీ తమ పార్టీ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి, తమ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడానికి వినియోగించే సాధనం కాదు సంక్షేమం.

ADVERTISEMENT

అయితే ఇప్పుడు ఆ సంక్షేమమే రూపం మార్చుకుని ఉచితాల పేరుతో ఊరూరా, ఇంటింటా బండ్లేసుకుని మరి తిరుగుతుంది. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ఈ ఉచితాల కాన్సెప్ట్ ట్రేండింగ్ లో ఉంది.

ఉచిత పథకాలు హామీలుగా ఇస్తే కానీ రాజకీయ పార్టీలకు అధికారం చేతికందడంలేదు. ఇందులో జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లు మొదలుకుని ప్రాంతీయ పార్టీలు టీడీపీ, వైసీపీ, బిఆర్ఎస్ వరకు అందరిదీ ఒకే సిద్ధాంతం. నువ్వు నాలుగిస్తే నేను ఎనిమిది ఇస్తా, నువ్వు 2 వేలంటే నేను 4 వేలు చేస్తా, నువ్వు ఇంట్లో ఒకరికిస్తే నేను ఇంటిల్లపాదికి అందిస్తా.

ప్రస్తుతం రాజకీయాలలో ఇదే ట్రెండ్ నడుస్తుంది. అయితే ఈ ట్రెండ్ వలన పార్టీలకు అధికారం దక్కుతుంది కానీ ఆ ఉచితాలు ఆయా పార్టీలకు మరోసారి అధికారాన్ని అందిస్తున్నాయా.? ఈ ప్రశ్నకు వైసీపీ నే చక్కటి ఉదాహరణ. గత ఐదేళ్లు కేవలం ఉచిత పథకాల బటన్లు నొక్కడానికే ప్రభుత్వం అన్నట్టుగా సాగిన వైసీపీ పాలన మరో ఛాన్స్ తీసుకోగలిగిందా.?

ఈ ఉచితాలు కేవలం ఒక వర్గం ఓటర్లను మాత్రమే ఆకర్షించగలవు. అలాగే ఉచిత పథకాల పరిధి కూడా చాల విస్తృతంగా పెరిగిపోయింది. మహిళలకు ఉచిత బస్సు కల్పిస్తే ఆటోవాలాలకు ఉపాధి సాయం కింద మరో పథకం ప్రవేశ పెట్టాల్సి వస్తుంది. ఇలా రాష్ట్ర ఖజానా మొత్తం ఈ ఉచితాలకే కేటాయిస్తే ప్రభుత్వం పట్ల మిగిలిన వర్గాల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చేదెవరు.?

ఇది ఆయా వర్గాలలో ప్రభుత్వ వైతిరేకతను పెంచినట్టు కాదా.? ఉండే ఐదేళ్ల సమయంలో ఉచిత పథకాల అమలు కోసమే లక్షల కోట్లు అప్పులు చేస్తే ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం, పారిశ్రామిక ప్రగతి కోసం, నీటి ప్రోజెక్టుల నిర్మాణం కోసం, భవిష్యత్ అవసరాల వినియోగం కోసం వెచ్చించే బడ్జెట్ ఎంత ఉండాలి.? దాని కోసం ఇంకెన్ని అప్పులు చెయ్యాలి.?

ఆ అప్పులకు బాధ్యత ఎవరు వహిస్తారు.? అవి కూడా ట్రూ అప్ చార్జీల మాదిరి ప్రజల జేబులో నుంచి తీయాల్సిందేగా.? సంక్షేమం అంటే ఒకరి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు చేసే సాయం, కానీ నేటి సంక్షేమం ఒకరి ఆర్థిక భారాన్ని తగ్గించే ప్రక్రియలో వేల మందికి ఆర్థిక భారాన్ని వేస్తున్నారు. రాష్ట్ర ఖజానాను అప్పుల సుడిగుండంలోకి నెడుతున్నారు.

ఈ భారాలు మోయలేక ప్రభుత్వాలు ఉచితాలను పరిమితం చేస్తే ఆ ఉచితాలే ఆ ప్రభుత్వం ఊపిరి తీస్తాయి. తిరిగి ప్రతిపక్షానికి తెస్తాయి. ఒక్కోసందర్భంలో ఆ అవకాశానికి కూడా రాజకీయ పార్టీలు దూరమవ్వక తప్పదు. పెరుగుట విరుగుట కొరకే అనే సామెత మాదిరి ఈ పెరిగిన ఉచితాలకు కూడా ఎదో రోజు విరుగుడు దొరకాలి అని ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories