సమాజంలో మంచీ ఉంటుంది… చెడూ ఉంటుంది. కానీ చెడు ప్రభావం, పర్యవసానాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆ ప్రభావంలో ఉన్న సమాజంలో జరిగే మంచి పెద్దగా కనపడదు. కానీ ధర్మో రక్షతి రక్షితః అని నమ్మే మన దేశంలో మంచి పనులు జరుగుతూనే ఉంటాయి.
ఈరోజుల్లో ఆస్తుల కోసం సొంత తల్లితండ్రులను పిల్లలు చంపుతున్నారు. వివాహేతర సంబంధాలతో భార్య భర్తలు చంపుకుంటున్నారు. అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నారని సొంత పిల్లలను కూడా చంపేస్తున్నారు. ప్రేమల కోసం ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు చంపుకుంటూనే ఉన్నారు.
ఇలాంటి ఘటనలు రోజూ మీడియాలో చూస్తున్నపుడు, ఎప్పుడో చనిపోయిన తమ మిత్రుడి కుటుంబాన్ని అతని మిత్రులు ఆదుకోవడం చూస్తే మనసు పులకరిస్తుంది.
ఇది ఎక్కడో జరుగలేదు. మన రాష్ట్రంలోనే నంద్యాల జిల్లా, రుద్రవరం మండలం నల్లవాగుపల్లె గ్రామంలో జరిగింది.
శ్రీధర్, రాధాకృష్ణ, శివకుమార్ రెడ్డి, మృత్యుంజయ, ప్రభాకర్, చంద్రలాల్ బాల్య స్నేహితులు. అందరూ స్థానిక శ్రీరామకృష్ణ విద్యాలయంలో పదో తరగతి వరకు చదువుకున్నారు. అలా వారందరూ కలిసి మెలిసి పెరిగి చదువులు పూర్తి చేసుకొని జీవితంలో స్థిరపడ్డారు. అలాగని ఎవరూ గొప్ప సంపాదనపరులు కూడా కారు.. అందరూ మధ్యతరగతి కుటుంబాలే.
వారిలో చట్టం ప్రభాకర్ సుమారు 15 ఏళ్ళ క్రితం అనారోగ్యంతో చనిపోయారు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్ద మరణంతో వారు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. అప్పుడు ప్రభాకర్ బాల్య మిత్రులు అందరూ ముందుకు వచ్చి స్నేహితుడి కుటుంబానికి అండగా నిలబడ్డారు.
అంతేకాదు… ఇటీవల స్నేహితుడి పెద్ద కుమార్తె లక్ష్మికి పెళ్ళి సంబంధం కుదరడంతో వారందరూ పెళ్ళి పెద్దలుగా నిలబడి దగ్గరుండి పెళ్ళి పనులన్నీ చూసుకున్నారు. వారే స్నేహితుడి కూతురిని పల్లకీలో మోసి పెళ్ళి మండపానికి తీసుకు వచ్చారు. ఆళ్ళగడ్డ మండలంలోని రామతీర్ధంలో శనివారం లక్ష్మి పెళ్ళి జరిగింది.
ఇటువంటి శుభాశుభ కార్యక్రమాలలో సొంత బందుమిత్రులే మొహం చాటేస్తుంటారు. ఒకవేళ వచ్చినా అతిధులుగా వచ్చి చూసి పోతుంటారు. కానీ ఎప్పుడో చనిపోయిన బాల్య స్నేహితుడు పట్ల అభిమానంతో వారు ఈవిదంగా చేయడం చాలా గొప్ప విషయం… చాలా అభినందనీయం. వారి స్పూర్తితో సమాజంలో కూడా ఇటువంటి మంచి మార్పు వస్తే ఇంకా సంతోషం.




