పాశ్చాత్య దేశాలలో మాదక ద్రవ్యాల సమస్య గురించి కథలుకథలుగా వింటూనే ఉంటాము. సినిమాలలో కూడా చూస్తూనే ఉంటాము. మన దేశంలో కూడా భారీగా గంజాయి పట్టుబడిందంటూ వార్తలలో చూస్తూనే ఉంటాము. అయితే మన దేశంలో గంజాయి, మాదక ద్రవ్యాలు సరఫరా, వాడకం చాప కింద నీరులా ఎంతగా విస్తరించాయో తెలుసుకునేందుకు ఈ రెండు ఉదాహరణలు చాలు.
తెలంగాణ ఈగల్ పోలీసులు వైద్య బృందాలు బుధవారం ఉదయం హటాత్తుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తనికీలు, విద్యార్ధులకు వైద్య పరీక్షలు మొదలుపెట్టారు. వైద్య పరీక్షలలో 17 మంది విద్యార్ధులు గంజాయి సేవించినట్లు తేలింది.
మరో ఘటన కూడా హైదరాబాద్‌లోనే జరిగింది. ఓ యువకుడు (దొంగ) బుధవారం రాత్రి హైదరాబాద్, పాతబస్తీలోని ఎవరూ లేని ఓ ఇంట్లో జొరబడి, డబ్బు, బంగారం వగైరా అంతా మూటగట్టేశాడు.
పని పూర్తయిన తర్వాత కాస్త రిలాక్స్ అవుదామని గంజాయి కొట్టాడు. ఆ డోస్ కాస్త ఎక్కువవడంతో ఆ ఇంట్లోనే హాయిగా నిద్రపోయాడు. మర్నాడు ఉదయం ఆ ఇంటి యజమాని వచ్చి లేపితే గానీ లేవలేదు.
చిన్న శాంపిల్స్ వంటి ఈ రెండు ఘటనలు యువత గంజాయికి అలవాటు పడుతున్నారని తెలియజేస్తోంది. ఏపీ ప్రతిపక్షంలో ‘గంజాయి బ్యాచ్‌లు’ అంటూ సిఎం చంద్రబాబు నాయుడు పదేపదే ఎద్దేవా చేస్తుండటం అందరూ వినే ఉంటారు.
నేటికీ గంజాయి, మాదక ద్రవ్యాల వార్తలను కేవలం వార్తలుగా మాత్రమే చూస్తున్నాము. కానీ అవే కుటుంబాలకు, సమాజానికి, రాష్ట్రానికి ప్రమాదకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కనుక మావోయిస్టులను ఏవిధంగా ఏరివేశారో అదేవిధంగా గంజాయి, మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముఠాలను, వాటిని విద్యార్ధులు, యువతకు అలవాటు చేసి అమ్ముతున్నవారిని ఏరిపడేయడం చాలా అవసరం.
ముఖ్యంగా విద్యార్ధులు వీటి జోలికి వెళ్ళకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ‘ఉడ్తా పంజాబ్’గా మారుతాయి.




