మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయం అయిపోయింది. ఈ మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ మొదలుపెట్టిన కొత్త సంప్రదాయం ప్రకారం… ఆయన కుమారుడు రవితేజ.. తన తండ్రి సమక్షంలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి అధికారపార్టీ కండువా కప్పుకోనున్నారు.
గంటా కండువా కప్పుకోకుండా వైఎస్సార్ కాంగ్రెస్ అనధికార ఎమ్మెల్యేగా కొనసాగబోతున్నారు. ఈ చేరిక వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డికి, స్థానిక మంత్రి అవంతి శ్రీనివాస్ కు ఇష్టం లేదని సమాచారం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల గంటాపై ట్విటర్‌లో ఆరోపణలు గుప్పించారు.
చంద్రబాబు హయాంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి జరిగిందని.. దానికి మూల్యం చెల్లించుకుంటారని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు గంటా పునీతం కాబోతున్నారు. టీడీపీలో రాజకీయ జీవితం ప్రారంభించిన గంటా.. ఆతర్వాత ప్రజారాజ్యంలో చేరారు. 2009లో ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతో… మంత్రి కూడా అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ టీడీపీ గూటికి చేరారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి మరోసారి మంత్రి కూడా అయ్యారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో.. కొంతకాలంగా ఆ పార్టీకి అంటీముట్టనట్టుగా ఉంటున్నారు.



