గతేడాది ఐపీఎల్ సీజన్ ను నెగ్గిన ‘కోల్కతా నైట్ రైడర్స్’ జట్టు కు కోచ్ గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ కు భారత క్రికెట్ బోర్డు రాజయోగాన్ని ప్రసాదించింది అనడంలో సంకోచమే లేదు. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీం ఇండియా హెడ్ కోచ్ గా నియమించి, ఇతర కోచింగ్ స్టాఫ్ ను కూడా తన ఇష్టానికే వదిలేసింది బీసీసీఐ.
అప్పటికే కెప్టెన్ గా టి-20 వరల్డ్ కప్ అందించిన రోహిత్, సీనియర్ ఆటగాళ్లుగా విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, అశ్విన్ వంటి వారు జట్టుకు అండగా ఉండగా, వీరికి ఇప్పుడు గంభీర్ చేయి తోడయితే ఇక ప్రపంచ క్రికెట్ ను భారత జట్టు ఏలుతుంది అని సంబర పడిపోయారు అభిమానులంతా.
అయితే, ఇలా అనుకున్న అభిమానులే నేడు గంభీర్ కు హెడ్ కోచ్ పదవి అనవసరంగా ఇచ్చారని ఫైర్ అవ్వటం చూస్తున్నాము. జట్టు నుండి విరాట్, రోహిత్, అశ్విన్ లు రిటైర్మెంట్ ప్రకటించి వెళ్లిపోగా, ప్రపంచంలోనే వన్ అఫ్ ది గ్రేటెస్ట్ ఆల్-రౌండర్ జడ్డు ను జట్టులో దూరం పెట్టటం మనం గంభీర్ హయాం లోనే చూస్తున్నాం.
సీనియర్ ఆటగాళ్లను వారు వయసు దృష్ట్యా జట్టుకు దూరం పెట్టాము అనే కారణం చెప్పినా, యువ సంచలనం ‘అర్షదీప్ సింగ్’ ప్రస్తుతం టి-20 లలో భారత్ తరపున అత్యధిక వికెట్లను పడగొట్టి మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, నిరంతరం బెంచ్ కే పరిమితం అవుతున్నాడు ఈ లెఫ్ట్-హ్యాండ్ పేసర్.
ఇతనితోపాటు అవకాశమిచ్చిన ప్రతిసారి తనని తాను నిరూపించుకుంటున్న కుల్దీప్ కు సైతం తుదిజట్టులో దక్కాల్సినటువంటి ప్రాధాన్యత దక్కట్లేదు. ఇదే కాక, శుబ్మాన్ గిల్ ను అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ గా నియమించటం వెనుక అర్ధం ఏంటంటూ చాలామంది తమ అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు.
వీటన్నింటికి మించి, ఒక పేరు ఇప్పుడు క్రికెట్ అభిమానుల నోట పదే పదే నిలుస్తుంది. ‘హర్షిత్ రణా’, కోల్కతా జట్టు ఐపీఎల్ ఛాంపియన్స్ గా నిలిచినపుడు ఆ జట్టు సభ్యుడు రణా, నేడు జట్టులో 3-ఫార్మటు ప్లేయర్ గా నిలిచాడు. అవసరమున్నా, లేకపోయినా తనను తుదిజట్టులోకి ఎంపిక చేయటం వెనుక కారణమేంటో గంభీర్ కే తెలియాలంటూ అభిమానులు సోషల్ మీడియా సాక్షిగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.




