ఆంధ్రప్రదేశ్ లో సంచలన విషయంగా మారిన ‘కాల్ మనీ’ స్కాంలో అనేక అరెస్టులు, కేసులు నమోదయ్యాయి. విజయవాడ వేదికగా వెలుగు చూసిన ఈ కేసులో రాజకీయ నాయకుల పాత్ర కూడా ప్రముఖంగా ఉందని తేలింది. దీంతో పోలీస్ వర్గాలు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించి, వందల సంఖ్యలో అరెస్టులు చేసారు. అలాగే ఇంకెవరైనా బాధితులు ఉంటే వచ్చి ఫిర్యాదులు చేయాలని, సత్వరమే చర్యలు తీసుకుంటామని ప్రజలను ఉద్దేశించి విజయవాడ నగర్ పోలీస్ కమీషనర్ గౌతం సవాంగ్ పిలుపునిచ్చారు. ఈ ప్రకటన వెలువడిన తర్వాత పోలీస్ వ్యవస్థపై మరింత నమ్మకం కలిగి, చాలా మంది ఫిర్యాదులు చేసారు, దానికి అనుగుణంగానే చర్యలు చేపడుతున్నారు. ఇదంతా గత వారం రోజులుగా జరుగుతున్న తంతే!
అయితే ఇపుడు “సీన్” రివర్స్ అయ్యింది. ‘కాల్ మనీ’ వ్యాపారులు గానీ, వారి అనుచరులు గానీ తమ వద్ద అప్పు తీసుకున్నవారి వద్దకు చేరుకొని తమ వివరాలు ఎవ్వరికీ చెప్పవద్దని, పోలీసుల వద్ద తమ పేరు ప్రస్తావనకు తేవొద్దని విజ్ఞప్తి చేసుకుంటున్నారట. అంతేకాదు, తీసుకున్న చెక్కులు, ఆస్తి పత్ర్రాలను తిరిగి ఇచ్చేస్తున్నారని తెలుస్తోంది. వడ్డీ సంగతి పక్కన పెడితే, ప్రస్తుతం ఉన్న అప్పును దఫాల వారీగా వీలు కుదిరినప్పుడల్లా చెల్లించమని కోరుతున్నారట. మరికొందరైతే అసలు అప్పు విషయం మరిచిపోవాల్సిందిగా చెప్తూ, పోలీసులకు మాత్రం ఎలాంటి సమాచారం అందివ్వరాదని కోరుతున్నారట.
అప్పటివరకు ప్రజల నుండి జలగల్లా పీడించిన వారికి వడ్డీ, అసలు కట్టకపోయినా పర్వాలేదు గానీ, కాల్ మనీ వ్యాపారంలో కూడా అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. వడ్డీ డబ్బులతో జీవనం సాగిస్తున్న వారు కూడా ఉన్నారు. తాజా పరిస్థితులతో వారి జీవితం కూడా అగమ్యగోచరంగా మారింది. రాజకీయ నాయకుల అండ వున్న వారు సహజంగా డిఫెన్స్ లో పడరు. వారి నుండి బెదిరింపు చర్యలే గానీ, లొంగుబాటు దాఖలాలు వుండవు. ప్రస్తుతం జరుగుతోంది కూడా అదే! ఇంతలా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన తర్వాత కూడా రాజకీయ నాయకుల అండ ఉన్న వారు ఇంకా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్న ఘటనలు ప్రతి రోజూ నమోదవుతున్నాయి.
కానీ, ఈ ఉదంతాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు ఎగ్గొట్టే వారి జాబితా పెరిగి పోతోందన్నది వ్యాపారాలు వ్యక్తపరుస్తున్న ఆవేదన. కాల్ మనీ తో పాటు సహజంగా వడ్డీ వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు తమ గోడు వెలిబుచ్చు కుంటున్నారు. కాల్ మనీని అడ్డం పెట్టుకుని తమకు డబ్బులు ఇవ్వాల్సిన బాధితులు “డబ్బులు వదులుకోకపోతే పోలీసులకు తమ పేర్లు చెప్తానని” బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్రెళ్ళగక్కుతున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో ఒక వైపే చూసిన పోలీస్ వర్గాలకు తాజా పరిణామాలు ఊహించని షాకిస్తున్నాయి. మరి దీనికి పోలీసులు ఎలాంటి పరిష్కార మార్గాన్ని చూపిస్తారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.





