చిత్రం: గోదారి గట్టుపైన
M9 రేటింగ్: 1.75/5
విడుదల తేదీ: మే 08, 2026
తారాగణం: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతిబాబు, లైలా, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రాజీవ్ కనకాల తదితరులు
నిర్మాణ సంస్థ: రెడ్ పప్పెట్ ఎంటర్టైన్మెంట్
దర్శకత్వం: సుభాష్ చంద్ర
సంగీతం: నాగవంశీ
నిర్మాత: అభినవ్ రావ్
ఛాయాగ్రహణం: సాయి సంతోష్
కూర్పు: అనిల్ పసల
షార్ట్ ఫిలిమ్స్ చూసే వాళ్ళకి బాగా సుపరిచితమైన పేరు “MR ప్రొడక్షన్స్”. వైజాగ్ లో వాళ్ళు చేసే షార్ట్ ఫిలిమ్స్ గురించి, అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో బాగా చెప్పుకునేవారు. ఆ షార్ట్ ఫిలిం డైరెక్టర్ సుభాష్ చంద్ర ఫుల్ లెంగ్త్ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం “గోదారి గట్టుపైన”. నటుడిగా “మేం ఫేమస్”తో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన రెండో సినిమా ఇది. ప్రమోషనల్ కంటెంట్ తో నాస్టాల్జియా టచ్ చేస్తూ ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాబ్ చేశారు. మరి సినిమా కూడా ప్రమోషనల్ ఫార్మాట్ లో కూల్ గా అలరించిందా లేదా అనేది చూద్దాం..!!
కథ:
ఓ స్వచ్చమైన గోదావరి జిల్లాల్లోని పల్లెటూర్లో ఆటో నడుపుతూ సంతోషంగా బ్రతుకుతుంటాడు రాజు (సుమంత్ ప్రభాస్). అనుకోకుండా చెంప దెబ్బ కొట్టిన మాయ (నిధి ప్రదీప్)తో ప్రేమలో పడి, అదే చెంప దెబ్బతో ఆమెనూ ప్రేమలో పడేసి.. ప్రేమ మాధుర్యాన్ని ఆస్వాదించడం మొదలెడతారు.
కట్ చేస్తే.. తానే ప్రేమించి, తానే ముద్దు పెట్టిన మాయ సడన్ గా.. నన్ను మర్చిపో అని రాజుకి వార్నింగ్ ఇస్తుంది.
మాయ ఎందుకలా బిహేవ్ చేస్తుంది? వీళ్ల ప్రేమ చిగురులోనే చెదిరిపోయే స్థాయికి చేరుకోవడానికి కారణం ఏమిటి? అనేది “గోదారి గట్టుపైన” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.
నటీనటుల పనితీరు:
సుమంత్ ప్రభాస్ నటనలో, స్క్రీన్ ప్రెజన్స్ లో మంచి ఈజ్ ఉంది. ఆటో అబ్బాయిగా భలే ఒదిగిపోయాడు. గోదావరి యాసలో పర్ఫెక్ట్ గా కాకపోయినా, ఎఫర్ట్స్ తో ఆకట్టుకున్నాడు. మంచి కథలు ఎంచుకుంటే, స్టార్ హీరోగా నిలదొక్కుకునేందుకు కావాల్సిన లక్షణాలు పుష్కలంగా ఉన్న హీరో.
నిధి ప్రదీప్ తెలుగు డైలాగ్స్ లిప్ సింక్ వరకు బాగుంది కానీ.. ఆ పాత్రకి కావాల్సిన చురుకుదనం, చిలిపితనం ఆమె ముఖంలో కొరవడ్డాయి. ఆమె క్యారెక్టరైజేషన్ లో లోపించిన క్లారిటీ ఆమె నటనలో కనబడింది.
జగపతిబాబు ఓ సగటు తండ్రి పాత్రలో మెప్పించే ప్రయత్నం చేశాడు కానీ.. ఆ బాధలో నిజాయితీ లోపించింది. అసలు జగపతిబాబు పోషించిన స్ప్లెండర్ శ్యాంబాబు పాత్రకి ఊరంతా ఎందుకు భయపడుతున్నారు? ఓ సాధారణ సెక్యూరిటీ గార్డు ఊరి చర్చ్ మరియు సంఘంలో అంత పట్టు ఎలా సాధించగలిగాడు? వంటి విషయాలకి జస్టిఫికేషన్ లేదు. అందువల్ల ఆ పాత్రలోని పెద్దరికాన్ని కానీ, బాధని కానీ ప్రేక్షకులు ఫీల్ అవ్వలేకపోయారు.
సుదర్శన్ కామెడీ మాత్రం నవ్వించింది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే బేగం సీక్వెన్స్ మొత్తం బాగా వర్కవుట్ అయ్యింది. రాజ్ కుమార్ కసిరెడ్డి, రాజీవ్ కనకాల సపోర్టింగ్ రోల్స్ లో పర్వాలేదనిపించుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు:
సాయి సంతోష్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. గోదావరి అందాలని సహజంగా చూపించే ప్రయత్నం ప్రశంసార్హం. అయితే.. కాలరీ గ్రేడింగ్ విషయంలో న్యాచురాలిటీ మిస్ అయ్యింది. నాగవంశీ పాటలు వినసొంపుగా ఉన్నా.. సందర్భానుసారంగా లేవు. కొన్ని సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ కి ఎమోషన్ కి సింక్ అవ్వలేదు. ఎడిటర్ అనిల్ ట్రాన్సిషన్స్ బాగున్నా.. కథనం, సన్నివేశాలు ఆ ఎఫెక్ట్స్ ను వాడుకోలేకపోయాయి.
ప్రొడక్షన్ డిజైన్ విషయంలో రెడ్ పప్పెట్ టీమ్ ఎక్కడా రాజీపడలేదు. అవసరమైనదానికంటే ఎక్కువే ఖర్చు పెట్టారు. ఆర్ట్ & కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కూడా అథెంటిసిటీ కోసం శ్రమించారని తెలుస్తోంది.
దర్శకుడు సుభాష్ చంద్ర ఎంచుకున్న కథలో కాన్ ఫ్లిక్ట్ పాయింట్ ఎక్కడుంది? అనేది పెద్ద ప్రశ్న. ఒక తండ్రి తన కూతుర్ని అమితంగా ప్రేమించి.. తనకంటే బాగా ఎవరూ ప్రేమించకూడదు అనే భయం నుండి వచ్చే ఇన్సెక్యురిటీని “నువ్వే నువ్వే”లో త్రివిక్రమ్ బాగా ప్రెజంట్ చేస్తే, ఓ తండ్రి ప్రేమ కూతురి విషయంలో, అది కూడా పెళ్లి విషయంలో ఎక్కడ తగ్గాలి? అనే అంశాన్ని “ఆకాశమంత” సినిమాలో అత్యద్భుతంగా ప్రెజెంట్ చేశాడు రాధా మోహన్.
“గోదారి గట్టుపైన” సినిమాలోనూ ఇంచుమించిగా అదే పాయింట్ ను పట్టుకున్నాడు సుభాష్ చంద్ర. అయితే.. ప్రేక్షకుల్ని కట్టిపడేసే కాన్ ఫ్లిక్ట్ పాయింట్ ను డిజైన్ చేసుకోలేకపోయాడు. హీరోహీరోయిన్ల ప్రేమకు అంతస్తు అడ్డంకి కాదు అని అర్థం చేసుకున్నాక.. ఎమోషనల్ గా ఆసక్తికరంగా ఉంటుందేమో అని ఎదురుచూస్తే.. ఆ ఎమోషన్ కూడా వర్కవుట్ అవ్వలేదు. పోనీ టచ్ చేసిన రిలీజియన్ యాంగిల్ ని కూడా సరిగా ఎక్స్ ప్లోర్ చేయలేదు. నాన్న హిందూ, అమ్మ ముస్లిం, గర్ల్ ఫ్రెండ్ క్రిస్టియన్ అనే సీక్వెన్స్ పెట్టడానికి కారణం ఏంటో కూడా అర్థం కాదు.
ఒకానొక పాయింట్ లో అసలు వీళ్ళ ప్రేమ గెలవలేకపోవడానికి లాజిక్ ఏమిటి? అనేది ఆడియన్స్ కి క్లారిటీ రాక, వాళ్ల ప్రేమ గెలవాలను ఎందుకని బలంగా కోరుకోవాలో కారణం తెలియక తికమకపడతారు. సహజమైన ఎమోషన్స్ కి స్కోప్ ఉన్నా.. ఎందుకో ఆ స్పేస్ నీ సరిగ్గా వాడుకోలేకపోయాడు సుభాష్. ఓవరాల్ గా.. బిగ్ స్క్రీన్ డెబ్యూలో అలరించలేకపోయాడు.
విశ్లేషణ:
కమర్షియల్ సినిమాల్లో లాజిక్స్ కోసం ఆడియన్స్ ఎప్పుడూ చూడరు. హీరోహీరోయిన్ల నడుమ ప్రేమ ఎప్పుడు, ఎందుకు పుట్టింది అనేది అసలు ఖాతరు కూడా చేయరు. కానీ.. మనం ప్రెజంట్ చేసేది ఒక సింపుల్ ఎంటర్టైనర్ అయినప్పుడు ఆ ప్రేమ ఎలా చిగురించింది అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ప్రేమకు అడ్డంకి ఏమిటి అనేది ప్రేక్షకుడికి అర్థమయ్యి.. ఆ ప్రేమ గెలవాని సినిమా చూస్తున్నంతసేపు తపించాలి. “గోదారి గట్టిపైన” సినిమాలో ఇవేమీ లేవు. సుమంత్ ప్రభాస్ నటన, సాయి సంతోష్ సినిమాటోగ్రఫీ వర్క్, అక్కడక్కడ సుదర్శన్ కామెడీ సీన్లు తప్ప ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే కంటెంట్ సినిమాలో లోపించింది. అందువల్ల.. హాట్ సమ్మర్ లో ఆడియన్స్ ను కూల్ చేయాల్సిన సినిమా.. ఆవిరైపోయింది.
ఓవరాల్ గా.. గట్టెక్కలేకపోయిన ప్రేమకథ!
M9 రేటింగ్: 1.75/5




