ఇన్ని దశాబ్దాలుగా బెంగళూరుకి ఐటి కంపెనీలు వస్తుంటే తెలుగు ప్రజలు ఎవరూ బాధపడలేదు. పైగా వాటి ద్వారా తమకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని సంతోషపడ్డారు. అలాగే పొందారు కూడా.
అదేవిదంగా వైసీపీ హయంలో ఏపీలో ఉన్నవి, ఎపీకి రావాల్సినవి తెలంగాణ రాష్ట్రానికి తరలిపోతుంటే ఆంద్ర ప్రజలు ‘మా బంగారం మంచిది కానప్పుడు ఏం చేస్తాం”’ అని అనుకున్నారే తప్ప అసూయ పడలేదు.
ఆ సమయంలో ఏపీలో పరిశ్రమలు, ఐటి కంపెనీలు కాగితాల మీద ఉండేవి లేదా మంత్రుల మాటల్లో మాత్రమే కనపడేవి. కనుక ఏపీ యువత పొట్ట చేత్తో పట్టుకొని హైదరాబాద్, బెంగళూరు నగరాలకు వలసలు పోయి ఐటి కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించుకొని అక్కడే స్థిరపడ్డారు.
ఇప్పుడు ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు వస్తున్నప్పుడు ఆయా రాష్ట్రాల ప్రజలు కూడా అలాగే భావిస్తుండవచ్చు.
కానీ ఏపీకి గూగుల్ కంపెనీ వస్తుంటే, దానికి భారీగా రాయితీలు ఇచ్చి తెచ్చుకుంటోందంటూ కర్ణాటక ఐటి మంత్రి ప్రియంక్ ఖర్గే అసూయతో మాట్లాడారు.
ఆయనకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చాలా చక్కగా జవాబిచ్చారు. ఒకప్పుడు ఐటి కంపెనీలను ఆకర్షించేందుకు కర్ణాటక ప్రభుత్వం కూడా ఈవిదంగానే అనేక రాయితీలు ఇచ్చి, మౌలిక సదుపాయాలు కల్పించింది. ఐటి కంపెనీలకు అవసరమైన ‘ఎకో సిస్టం’ ఏర్పడటంతో బెంగళూరుకి ఐటి కంపెనీలు క్యూ కట్టాయి.
ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఐటి కంపెనీలకు రాయితీలు ఇవ్వకపోయినా వస్తూనే ఉన్నాయి. అదేవిదంగా ఏపీలో ఐటి కంపెనీలకు తగిన ఎకో సిస్టం ఏర్పడే వరకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వక తప్పదు. ఒకసారి ఇక్కడ కూడా బెంగళూరు వంటి ఎకో సిస్టం ఏర్పడితే అప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా ఐటి కంపెనీలకు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
అయినా బెంగళూరు నగరం ఇప్పటికే ఐటి కంపెనీలతో నిండిపోయింది. కనుక ఏపీకి వస్తున్నవాటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు,” అని అన్నారు.







